‘బాస్ పార్టీ’ అంటూ మొన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఒక టీజర్ వదిలితే.. అతడిని మామూలుగా ట్రోల్ చేయలేదు సోషల్ మీడియా జనం. నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్టు ముడేస్కో.. అంటూ దేవి పాడిన హుక్ లైన్స్ మీద మీమ్స్ మోత మోగిపోయింది. దేవిని నెటిజన్లు ఒక రేంజిలో వాయించేస్తున్నారు . ఐతే అసలు పాట రిలీజయ్యాక పరిస్థితి కొంచెం మారింది. పాటకు మంచి స్పందనే వస్తోంది. కాకపోతే దేవి ఒకప్పట్లా అయితే మ్యాజిక్ చేయట్లేదన్నది మాత్రం వాస్తవం.
ఐతే కనీసం టీజర్ లాంచ్ అయినపుడు ఉన్న నెగెటివిటీ పోయిందిలే అని దేవి అండ్ టీం హ్యాపీగా ఫీలై ఉండొచ్చు. కాగా దేవిశ్రీకి సంబంధించిన హడావుడి కొంచెం సద్దుమణగ్గా.. ఇంతలో తమన్ లైన్లోకి వచ్చాడు. గతంలో తమన్ మీద ఏ రేంజిలో ట్రోలింగ్ జరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అసలు టాలీవుడ్లో తమన్ మీద జరిగినంత సోషల్ మీడియా ట్రోలింగ్ సంగీత దర్శకుల్లో ఇంకెవరి మీదా జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఐతే గత కొన్నేళ్లలో మంచి మంచి ఆల్బమ్స్‌తో నెగెటివిటీని తగ్గించుకున్నాడు. కానీ అప్పుడప్పుడు కొన్ని ట్యూన్స్ మాత్రం తమన్‌కు తలనొప్పిగా మారుతుంటాయి. తాజాగా ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి లాంచ్ చేసిన తొలి పాట ‘జై బాలయ్యా’ ట్యూన్ కూడా అలాగే ట్రోలర్లకు ఛాన్స్ ఇచ్చేసింది.
ఈ పాటలో మంచి బీట్, ఊపు ఉన్నప్పటికీ.. ట్యూన్ అయితే కొత్తది కాదన్నది స్పష్టం. ముఖ్యంగా ‘ఒసేయ్ రాములమ్మా’ పాటలో వినిపించే డప్పు సౌండ్ యాజిటీజ్ దించేసినట్లు అనిపించడంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. రెండు ట్యూన్స్ పక్కపక్కన పెట్టి.. తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలా చిన్న ఛాన్స్ దొరికినా ట్రోలర్స్ రెచ్చిపోవడం మామూలే. అందులోనూ తమన్ వారికి దొరికాడంటే మోత మామూలుగా ఉండదు.