సినిమా టికెట్ల వివాదం నేపథ్యంలో కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్న అంశంపై కూడా అదే రీతిలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా టాలీవుడ్ లో వ్యవహరించడంతో అసలు ఇండస్ట్రీకి ఒకరు పెద్దగా ఉండాలన్న టాక్ వచ్చింది. చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అని కొందరు అంటుంటే….ఆయన మాత్రం తాను ఇండస్ట్రీ బిడ్డను అని, పెద్దను కాదని తేల్చేశారు.
ఈ క్రమంలోనే అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేేశారు దర్శకుడు రాజమౌళి. చిరంజీవికి ఇష్టమున్నా లేకపోయినా…ఆయనే టాలీవుడ్ పెద్ద అని జక్కన్న బల్లగుద్దిమరీ చెప్పేశారు. సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత జక్కన్న మీడియా సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇండస్ట్రీ బాగుండాలని చిరంజీవిగారు చేసే పనులే ఆయనను ఇండస్ట్రీ పెద్ద అని చెబుతున్నాయని కితాబిచ్చారు రాజమౌళి.
సినిమా టికెట్ల వ్యవహారంతోపాటు పలు సమస్యలపై ముందుకెళ్లాలా వెనక్కెళ్లాలా అని కొంతకాలంగా ఇండస్ట్రీ అయోమయంలో ఉందన్నారు. అటువంటి స్థితిలో ఎవరి ప్రయత్నం వారు చేశారని, అయితే, జగన్ తో ఆయనుకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని చిరంజీవి ఈ సమస్యను పరిష్కరించారని రాజమౌళి ప్రశంసించారు. గత 6-7 నెలలుగా చిరంజీవి ఈ సమస్య పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
సినిమా రంగంపై, నిర్మాతల గురించి,ఎగ్జిబిటర్ల గురించి సీఎం జగన్ కు చాలా అవగాహన ఉందన్నారు రాజమౌళి. ఈ రోజు భేటీలో కూడా తమ సమస్యలను, అభిప్రాయాలను జగన్ చాలా ఓపికగా విన్నారని, అందుకు ఆయనకు ధన్యవాదాలని రాజమౌళి చెప్పారు.