దర్శక ధీరుడు రాజమౌళి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటాడు. ప్రపంచ స్థాయికి చేరినా కూడా ఇంకా నేల మీదే ఉండటం గొప్ప విషయమే. కానీ ఈ క్రమంలో ఒక టచ్ చేయయూడని వ్యక్తిని టచ్ చేసి తన అభిమానుల్ని నిరాశకు గురి చేశాడు జక్కన్న. తాను రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర కథానాయకుల్లో ఒకడైన రామ్ చరణ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి.. తన టీం అందరితో కలిసి మొక్కలు నాటాడు.
ఆ తర్వాత రాజమౌౌళి కొందరిని తాను నామినేట్ చేశాడు. అందులో ఒకడు రామ్ గోపాల్ వర్మ. ఐతే రాజమౌళి అంతటివాడు ఛాలెంజ్ చేశాడు కదా అని దాన్నేమీ యాక్సెప్ట్ చేయలేదు వర్మ. తాను అందుకు తగనంటూ ఛాలెంజ్‌ను తిరస్కరించాడు. వర్మ ఈ ఛాలెంజ్ తీసుకున్నాడా లేదా అన్నది పక్కన పెడితే.. వర్మను రాజమౌళి ఛాలెంజ్ చేయడమే చాలామందికి నచ్చట్లేదు.
ఒకప్పుడు వర్మ గొప్ప దర్శకుడే. రాజమౌళిని కూడా ఆయన ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. కానీ గత దశాబ్దంలో వర్మ పతనం గురించి అందరికీ తెలిసిందే. ఫిలిం మేకర్‌గానే కాదు.. వ్యక్తిగానూ దిగజారిపోయాడు. పవన్ కళ్యాణ్ లాంటి కొందరిని టార్గెట్ చేసి తెర వెనుక ఎంత దారుణమైన వ్యవహారాలు నడిపాడో అందరికీ తెలిసిందే. దీంతో టాలీవుడ్లో దాదాపుగా అందరూ వర్మకు యాంటీ అయిపోయారు. ప్రేక్షకుల ఆలోచన కూడా అలాగే ఉంది.
అసలు వర్మకు, ఆయన మాటలకు ఎవరూ విలువ ఇవ్వట్లేదు. ఆయన సినిమాలనూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమయంలో వర్మకు అంత విలువ ఇచ్చి రాజమౌళి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగం కావాలని కోరడం చాలామందికి నచ్చలేదు. రాజమౌళి స్థాయికి ఇది తగదంటున్నారు. ముఖ్యంగా చరణ్ నుంచి ఛాలెంజ్ తీసుకుని వర్మకు ఛాలెంజ్ విసరడం మెగా ఫ్యాన్స్‌కు అయితే అసలేమాత్రం నచ్చట్లేదు. ఆయనకిది అవసరమా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.