ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో తాజాగా మరోసారి పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. దీంతో, రాజధాని కొలంబోలో ప్రజాగ్రహం మిన్నంటింది. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స పరారయ్యారు. ఆయన నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించడంతో తప్పించుకున్నారు. ఇక, ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిరసనకారులు నిప్పంటించారు. ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేసిన నిరసనకారులు రచ్చ రచ్చ చేశారు.
గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించిన నిరసన కారులు…ఆయన నివాసంలోకి చొరబడ్డారు.ఇంటి లోపలి భాగంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కొందరు నిరసనకారులు ఈత కొట్టారు. మరికొందరు ఇంట్లోని గదుల్లో ఉన్న ఫర్నిచర్ పై దర్జాగా కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలో పరిస్థితి అదుపుతప్పుతుండడంతో ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు రణిల్ విక్రమసింఘే మార్గం సుగమం చేస్తున్నారని ప్రధాని కార్యాలయం తెలిపింది.
కాగా, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నాటి ప్రధాని మహీంద్రా రాజపక్సె రాజీనామా చేశారు. దీంతో గత మే నెలలో ప్రధానిగా విక్రమసింఘేను అధ్యక్షుడు గోటబయా రాజపక్సె నియమించారు. తాజా పరిణామాలతో విక్రమసింఘే తానూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజఫక్స శ్రీలంక నేవీ నౌకలో సూట్‌కేస్‌లతో పరారైనట్లు తెలుస్తోంది.
Comments 1