శ్రీలంక తాజా మాజీ అద్యక్షుడు గొటబాయ రాజపక్సతో పాటు ఆయన కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చింది. సింగపూర్లో ఉంటున్న రాజపక్సను వెంటనే తమదేశం నుండి వెళ్ళిపోవాలని సింగపూర్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మాల్దీవుల నుండి రాజపక్స తన కుటుంబంతో కలిసి మూడురోజుల క్రితమే సింగపూర్ చేరుకున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే రాజపక్స సింగపూర్ చేరుకున్నారో వెంటనే స్ధానికంగా ఉన్న లంక ప్రజలు నిరసనలు మొదలుపెట్టేశారు.
తాజా మాజీ అద్యక్షుడి కారణంగా తమ దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నట్లు గ్రహించిన సింగపూర్ ప్రభుత్వం వెంటనే గొటబాయను కుటుంబంతో సహా దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసింది. రాజపక్సను జనాలు శ్రీలకంలో ఉండనీయలేదు. జనాలు దాడులు చేస్తారన్న భయంతో మాల్దీవులకు పారిపోయారు. అక్కడ కూడా జనాలు నిరసనలు మొదలుపెట్టారు. రాజపక్స బసచేసున్న భవనంపైకి దాడులు మొదలుపెట్టారు.
దాంతో పెద్ద సమస్యగా తయారయ్యే అవకాశముండటంతో వెంటనే మాల్దీవుల నుండి పంపేసింది అక్కడి ప్రభుత్వం. దుబాయ్ వెళ్ళాలని ప్రయత్నించిన మాజీ అద్యక్షుడు సాధ్యంకాక సింగపూర్ కు చేరుకున్నారు. ఇపుడు సింగపూర్లో కూడా ఉండే అవకాశం లేకపోవటంతో ఎటు వెళతారనేది ఆసక్తిగా మారింది. దుబాయ్ కూడా రాజపక్స కుటుంబానికి ఆశ్రయం ఇవ్వటానికి సుముఖంగా లేదని వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రాజపక్స తర్వాత ప్లాన్ ఏమిటి ?
అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కళ్ళు మూసుకుపోయి వ్యవహరించిన ఫలితమే ఇపుడు ఆయనతో పాటు ఆయన కుటుంబం అనుభవిస్తోంది. అధ్యక్షుడిగా రాజపక్స, ప్రధానమంత్రిగా మరో సోదరుడు, ఆర్ధికమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులుగా మరో ఇద్దరు సోదరులు దేశాన్ని నాశనం చేసేశారు. తమ పాలనతో దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేయటంతో చివరకు జనాలకు కడపుమండి తిరగబడ్డారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక చివరకు రాజపక్స కుటుంబంతో పాటు దేశం వదిలి పారిపోయారు. జరిగుతున్నది చూసిన విదేశాల్లో ఏది కూడా రాజపక్సకు ఆశ్రయం ఇవ్వటానికి ఇష్టపడటంలేదు. మరిపుడు ఏ దేశానికి వెళతారో చూడాలి.