ఈనెల మొదటి నుంచి శ్రీలంక జనాలు అల్లాడిపోతున్నారు. తినటానికి సరైన తిండి దొరకటం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు చుక్కల్లోకి వెళ్ళిపోయాయి. దేశం యావత్తు దాదాపు చీకటిలోకి వెళిపోతోంది. విషయం ఏమిటంటే లంకలో రోజుకు 10 గంటల పాటు కరెంటు కోతలు అధికారికంగానే అమలవుతోంది. అధికారికంగానే 10 గంటల కోతలున్నాయంటే అనధికారికంగా ఇంకెన్ని గంటలు కోత పడుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
కరెంటు కోతలు గంటలపాటు ఎందుకు కోతపడుతోంది. ఎందుకంటే జలవిద్యుత్ కు అవసరమైన ఇంధనం అందుబాటులో లేకపోవటమే ప్రధాన కారణం. రోజుకు 750 మెగావాట్ల విద్యుత్ కొరతతో దేశం అల్లాడిపోతోంది. జలవిద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అసలు ఆర్థిక క్రమశిక్షణ తప్పి ఉచిత పథకాలతో దేశం కుదేలయింది. ఈ సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరో చావు దెబ్బ . ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా శ్రీలంకకు అందాల్సిన చమురు, వంటనూనెలతో పాటు ఇతర నిత్యవాసరాలు, పెట్రోల్, డీజల్ కూడా సరగా అందడం లేదు.
దీంతో శ్రీలంకలో జనాల పరిస్ధితులు అస్తవ్యస్ధంగా తయారైపోయింది. పెట్రోలు, డీజల్ కోసం జనాలెవరు బంకుల దగ్గరకు రావద్దని ప్రభుత్వం ప్రకటించేసింది. ఎందుకంటే బంకుల్లో పెట్రోలు, డీజల్ స్టాక్ లేదు. నిజానికి విదేశాల నుండి పెట్రోలో, డీజల్ దిగుమతయ్యింది. అయితే ఆ డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. అందుకనే వచ్చిన స్టాక్ అంతా ఓడల్లో తీరంలోనే ఉండిపోయింది. శుక్రవారం నాటికి డబ్బులు చెల్లించే అవకాశముందని అధికారయంత్రాంగం ఆశిస్తోంది. అందుకనే జనాలను బంకుల దగ్గరకు రావద్దని చెప్పింది.
పెట్రోల్, డీజల్లాగానే నిత్యావసరాల పరిస్ధితి కూడా చేయిదాటిపోయింది. కిలో బంగాళదుంపల ఖరీదు వందల రూపాయలకు చేరుకుంది. ఇక బ్రెడ్డు, రొట్టెలు, జామ్ వంటి వాటి ఖరీదు గురించి జనాలు ఆలోచించటమే మానేశారు. ఎందుకంటే వాటిని కొనేంత సీన్ తమకు లేదని ఆశలు వదిలేసుకున్నారు. మొత్తానికి శ్రీలంకలో జనాల పరిస్ధితులు అల్లకల్లోలంగా తయారైంది. కరెంటు లేని కారణంగా ఆఫీసులు, రెస్టారెంట్లు తదితరాలన్నీ కొవ్వొత్తుల వెలుగులో కనబడుతున్నాయి. ఎంతో అత్యవసరమైతే కానీ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు కూడా చేయటం లేదు. మరి ఈ పరిస్థితుల నుండి శ్రీలంక ఎప్పటికి బయటపడుతుందో ఏమో.