కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు చిత్రాలతో తనపై అంచనాల్ని భారీగా పెంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. పక్కా క్లాస్ చిత్రాలతో తన అభిరుచిని చాటుకుంటూనే.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్.
తొలి రెండు చిత్రాల్లో అతడి ప్రతిభ చూసి.. మెగా ఫ్యామిలీ కుర్రాడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేసే బాధ్యత అతడి నెత్తినే పెట్టారు. కానీ ‘ముకుంద’తో అతను అంచనాలను అందుకోలేకపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబు అతడి మీద నమ్మకంతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తే అది దిద్దుకోలేని తప్పుగా మిగిలిపోయింది. దెబ్బకి నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో లేకుండా పోయాడు శ్రీకాంత్.
మళ్లీ అతను నారప్ప అనే రీమేక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. తన శైలికి ఏమాత్రం నప్పని తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ను శ్రీకాంత్ ఉన్నదున్నట్లుగా రీమేక్ చేసి పెట్టాడు. ఆ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావడంతో పెద్దగా డిస్కషనే లేకపోయింది. రిలీజ్ తర్వాత శ్రీకాంత్ ఎప్పట్లాగే తెరమరుగు అయిపోయాడు. ఇక అతణ్ని అందరూ మరిచిపోతున్న టైంలో కొత్త సినిమాతో రెడీ అవుతున్నాడు శ్రీకాంత్.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి.. శ్రీకాంత్ కొత్త చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ఎవరన్నది వెల్లడి కాలేదు. ఒక వయొలెంట్ పోస్టర్ ద్వారా సినిమాను అనౌన్స్ చేశారు. రేపు టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు. పీకే1 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారీ సినిమాకు. అంటే పీకే అనే షార్ట్ నేమ్ ఉన్న కొత్త హీరో ఎవరో ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో శ్రీకాంత్ ఎలాంటి ముద్ర వేస్తాడో.. ఏమేర బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.