1,2,3,4,5 ర్యాంకులు మావే… ఎంట్రన్స్ పరీక్ష ఫలితాల్లో మా విద్యార్థుల ప్రభంజనం… అంటూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఊదరగొట్టడం చూస్తుంటాం.
అందులో నిజం ఎంతుందో ఎవరూ ఆలోచించరు. వెంటనే తమ పిల్లలను ఆయా కళాశాలల్లో చేర్పించేందుకు ఉబలాటపడుతూ ఉంటారు.
తల తాకట్టు పెట్టయినా తమ పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు.
అయితే విద్యా సంస్థల విపరీత ప్రచారం ఆఖరకు ఎలా తయారయ్యిందంటే.. ఉత్తమ ర్యాంకు తెచ్చుకునే విద్యార్థులు ఎవరు, ఎక్కడివారు అని ఆలోచించకుండా వెంటనే తమ కళాశాల వారే అంటూ ప్రకటించుకుంటారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థల ఉదంతమే.. ఇందుకు ఉదాహరణ. లక్షల ఫీజులు దొబ్బేందుకు కళాశాలలు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధంగా ఉంటాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.
ఐఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మొదటి ర్యాంకు తెచ్చుకున్న రాజస్థాన్ విద్యార్థి తమ వాడే అంటూ నారాయణ, చైతన్య కాలేజీలు.. అడ్డగోలుగా ప్రకటనలు ఇచ్చి అడ్డంగా బుక్కయ్యాయి. వివరాల్లోకి వెళితే…
ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాజస్థాన్‌కి చెందిన మృదుల్ అగర్వాల్ అనే విద్యార్థికి మొదటి ర్యాంక్ వచ్చింది.
ఇదిలా వుండగా మృదుల్ తమ విద్యార్థే అంటూ ఏకంగా నాలుగు కాలేజీలు ప్రకటించుకున్నాయి.
ఈ విషయం తెలిసి ప్రజలంతా గందరగోళానికి గురయ్యారు. ఒక విద్యార్థి నాలుగు కాలేజీల్లో చదవడం ఎలా సాధ్యం అంటూ చర్చించుకుంటున్నారు.
కొందరైతే ఈ ప్రకటన నిజమే అనుకుని గుడ్డిగా నమ్మారు. తమ పిల్లలను చేర్చించేందుకు సిద్ధమయ్యారంటే వారి ప్రకటనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
శ్రీచైతన్య సంస్థ ఇచ్చిన ప్రకటనలో మృదుల్ కోటు వేసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. అతని పేరు కింద మాత్రం.. చిన్న అక్షరాలతో ఆన్లైన్ స్టూడెంట్ అని రాశారు.
మరోవైపు మృదుల్ అగర్వాల్.. తమ విద్యార్థే అంటూ నారాయణ కాలేజీ కూడా ప్రకటించుకుంది.
ఈ రెండు కళాశాలలు ఒక ఎత్తైతే.. ఇక ఫిట్జీ సంస్థ ఒకడుగు ముందుకేసి, మృదుల్ తమ సంస్థలో చదివినందుకు కృతజ్ఞతగా విద్యార్థి లేఖ రాసినట్లుగా అతని సంతకంతో సహా ప్రకటించింది. ఇదంతా వివరిస్తూ ఓ వీడియోను కూడా రూపొందించారు.
ఇవన్నీ చూసి విద్యార్థుల తల్లిదండ్రులకు అసలు ఆ విద్యార్థి.. ఏ కళాశాలలో చదువుకున్నాడో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
తీరా దీనిపై ఆరాతీస్తే అసలు ఆ విద్యార్థి ఇక్కడ చదవనే లేదని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ విద్యార్థే చెప్పాడు.
కేవలం శ్రీచైతన్య, నారాయణ సంస్థలు నిర్వహించిన టెస్ట్ సిరీస్(మాక్ టెస్టులు)లో మాత్రమే పాల్గొన్నట్టు వివరించారు.
మాక్ టెస్టుల్లో పాల్గొనడం తప్ప.. వారి క్లాసులకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ హాజరు కాలేదని తెలిపాడు.
రాజస్థాన్ రాష్ట్రం కోట నగరానికి చెందిన అలెన్ సంస్థకు చెందిన జైపూర్ క్యాంపస్‌లో మృదుల్ చదివినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
మృదుల్ నాలుగేళ్ల పాటూ తమ కళాశాల, క్యాంపస్‌లో రోజూ తరగతులకు హాజరైనట్లు ఆధారాలున్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు.
దీనిపై కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.
ఆ విద్యా సంస్థలు సిగ్గులేకుండా మృదుల్ తమ విద్యార్థి అంటూ ఎలా ప్రకటించేుకుంటాయని ప్రశ్నించారు.
జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. శ్రీచైతన్య ప్రకటనల్లో నటిస్తున్న అల్లు అర్జున్‌కి ఈ విషయం తెలుసా అంటూ ప్రశ్నించారు..