ఇటీవలె `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించి మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రారంభించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కావడంతో.. ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇకపోతే ఈ సినిమా పూర్తైన వెంటనే మహేశ్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై గత ఏడాదే అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డా.కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. `ఆర్ఆర్ఆర్` వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుండి రాబోతున్న చిత్రమిది. గత కొద్ది నెలల నుంచీ వెకేషన్ మూడ్ లో ఉన్న ఆయన.. మళ్లీ ఇప్పుడు వర్క్ మూడ్ లోకి వచ్చి మహేశ్ మూవీపై ఫోకస్ పెట్టారట.
ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ తో పాటు కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారట. ఇందులో భాగంగానే జక్కన్న మహేశ్ కోసం శ్రద్ధాపై శ్రద్ధ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్రద్ధా కపూర్ మహేశ్ బాబు సరసన పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట.
ఇందులో భాగంగానే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, శ్రద్ధాకపూర్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `సాహో` మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో విడుదలైన ఈ చిత్రం నెగటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లనే రాబట్టింది.
ఈ మూవీ అనంతరం మరో తెలుగు సినిమా చేయని శ్రద్ధా.. బాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటూ అక్కడ బిజీగా మారింది. ఇక ఇప్పుడు ఈ భామకు ఏకంగా రాజమౌళి సినిమాలో నటించే అద్భుత అవకాశం రాబోతోందని టాక్ నడుస్తోంది. అదే నిజమైతే ఆమె దశ తిరిగినట్లే అవుతుంది.