నిజంగానే ఇది శుభ పరిణామం. అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు కళ్లాలు వేసే విషయంలో ఏం చేయాలని బుర్రబద్ధలు కొట్టుకుంటున్న వేళ.. అనూహ్యంగా కేసుల నమోదు తగ్గుముఖం పట్టటం ఒకటైతే.. రోజు రోజుకు కేసుల నమోదు అంతకంతకూ తగ్గిపోతున్న వైనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ పరిణామాన్ని ప్రభుత్వం నుంచి వైరాలజీ ప్రముఖుల వరకు ఎవరూ ఊహించనిదిగా చెప్పాలి. వాస్తవానికి వర్షాకాలం నుంచి చలికాలంలోకి వెళ్లిపోతున్న వేళ.. కరోనా కేసులు మరింత పెరుగుతాయని అందరూ అంచనా వేశారు. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది.
దేశంలో చోటు చేసుకుంటున్నపరిణామాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రోజుకు 92 వేల వరకు కొత్త కేసులు నమోదయ్యే పరిస్థితి. విస్తరిస్తున్న వైరస్ కారణంగా.. రోజుకు లక్ష కేసుల మార్కుకు చేరుకోవటం కష్టం కాదన్న అంచనా వ్యక్తమైంది.దీంతో.. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాంటిది ఒక్కసారిగా కేసుల నమోదు తగ్గుముఖం పట్టటం.. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. 92 వేల కేసుల నుంచి ఇప్పుడు 60 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. సోమవారం విషయానికి వస్తే.. 55 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.
కొత్త కేసులతో పాటు.. మరణాలు కూడా తగ్గినట్లుగా చెబుతున్నారు. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 71.75లక్షలకు చేరింది.ఇందులో రికవరి కేసుల సంఖ్య 62.27లక్షలు. దీంతో రికవరీ కేసులు 86.8 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 8.38 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్నట్లే మరిన్ని జాగ్రత్తల్ని తీసుకుంటే.. కేసుల నమోదు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ విషయం మీద మరింత స్పష్టత కోసం మరో రెండు రోజులు నమోదయ్యే కేసుల్ని గమనించాల్సి ఉంది. ఆ తర్వాత వారం పాటు అదేపనిగా కేసుల నమోదు తగ్గుముఖం పడితే..శుభపరిణామం.
అయితే.. ఇక్కడే మరో ముప్పు ఉందన్నది మర్చిపోకూడదు.సాధారణంగా మొదటివేవ్ ముగిసి.. రెండో వేవ్ మధ్య కాస్త గ్యాప్ ఉంటుంది. కానీ.. మొదటి వేవ్ ముగిసిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకుంటే.. ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇతర విషయాల్లోనూ జాగ్రత్తలు పాటిస్తే.. రెండో వేవ్ ను తప్పించుకునే వీలుంది.ఒకవేళ.. వచ్చినా తీవ్రత తక్కువగా ఉంటుంది. దీని కోసం ఏమేం చేయాలంటే.. కేసులు తగ్గాయి కదా అని.. భౌతిక దూరాన్ని పాటించకుండా ఉండటం.. మాస్కుల్ని తీసి పక్కన పెట్టేయటం.. శానిటైజర్లను వాడకుండా ఉండటంలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నామో.. అన్ని జాగ్రత్తల్నితీసుకుంటే సేఫ్ గా ఉండటం ఖాయం. అదే జరిగితే.. దేశం కరోనా భూతంపై పైచేయి సాధించినట్లు అవుతుంది.