ఆ వ్యక్తి మొహం నేను అసెంబ్లీలో చూడకూడదన్న ఎన్టీఆర్… యరపతినేనికి చెప్పింది ఇదే..!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అన్నగారు ఎన్టీఆర్.. అన్ని విషయాల్లో నూ అలానే వ్యవహరించారు. ఆత్మగౌరవానికే పెద్దపీట వేశారు. ఎక్కడ ఏం చేసినా.. ఆయన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కూడా అలానే ఉండేవి. ఇలా.. 1994 ఎన్నికల ప్రచారంలోఉమ్మడి గుంటూరు జిల్లాలో చిత్రమైన పరిస్థితి కనిపించింది. అప్పట్లో మాచర్ల నియోజకవర్గాన్ని అన్నగారు లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ గెలిచినా.. గెలవకపోయినా.. మాచర్లలో మాత్రం పార్టీ విజయం సాధించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే అన్నగారు దీనికి సంబంధించిన కసరత్తును ముమ్మరం చేశారు. అప్పటి యువ నాయకు డు.. ప్రస్తుత గురజాల టీడీపీ ఇంచార్జ్ యరపతినేని శ్రీనివాసరావును అన్నగారు ఎంతో ప్రోత్సహించారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన యరపతినేని.. రెంటచింతల మండలంలోని మంచికల్లులో జన్మించ డంతో ఆయనకు మాచర్లపై పట్టుంది. దీంతో యరపతినేనికి భారీ టార్గెట్ అప్పగించారు ఎన్టీఆర్.. “ఆ వ్యక్తి మొహం నేను అసెంబ్లీలో చూడకూడదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.. మాచర్లలో టీడీపీ జెండా ఎగరాలి“ అని నిర్దేశించారు.
ఎన్టీఆర్ మరోసారి అసెంబ్లీలో మొహం చూడకూడదని అనుకున్న నాయకుడు కాంగ్రెస్‌కు చెందిన పిన్నెల్లి సుందరరామిరెడ్డి. అసెంబ్లీలో జరిగిన వివాదం నేపథ్యంలో అన్నగారు ఈ సంచలన నిర్ణయం తీసుకుని.. బాధ్యతను యరపతినేనికి అప్పగించారు. ఈ క్రమంలోనే మాచర్ల అసెంబ్లీ టికెట్‌ను 1994లో యరపతినేని శ్రీనివాసరావుకే కేటాయించారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గం కావడంతో.. దూకుడు చూపించడం ప్రారంభించారు. అయితే.. తీరా ఎన్నికల సమయానికి ఈక్వేషన్లు మారిపోయాయి.
యరపతినేనిని గురజాలకు షిఫ్ట్ చేసి.. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కుర్రి పున్నారెడ్డికి ఇచ్చారు. ఇక, ఈయనను గెలిపించం.. అటు అన్నగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం.. మరోవైపు తాను గురజాలలో గెలుపు గుర్రం ఎక్కడం వంటివి యరపతినేనికి పెద్ద సవాలేనని చెప్పాలి. అయినప్పటికి నిద్రాహారాలు మానేసి.. అహరహం ఆయన శ్రమించారు. అన్నగారి షరిష్మాకు తోడు తన రాజకీయ వ్యూహాన్ని కూడా కలిపి.. మాచర్లలో విజయం సాధించారు.
అదేసమయంలో తను కూడా గురజాల నుంచి విజయం దక్కించుకున్నారు. ఆ ఒక్కసారే కాదు.. 1994తో పాటు తర్వాత 1999లోనూ అత్యంత కీలకమైన మాచర్లలో టీడీపీ గెలిచేలా యరపతినేని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థులు మారినా.. పార్టీ మాత్రం విజయం దక్కించుకుంది. ఇటు గురజాల, అటు మాచర్లలోనూ యరపతినేని పట్టు సాధించి.. ఆది నుంచి కూడా పార్టీకి అండగా ఉండడం గమనార్హం.