మన దేశంలో ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలలో చాలామందిపై కేసులు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక, వారిలో కొందరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదై విచారణ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ నత్తనడకన సాగుతున్న వైనంపై గతంలో పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగంగా సాగేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ గత ఏడాది నవంబరులోనే కేంద్రానికి సుప్రీం నోటీసులిచ్చింది.
అయితే, ఇప్పటివరకు ఆ నోటీసులపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఈ వ్యవహారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు రావడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కేంద్రంపై జస్టిస్ ఎన్వీ రమణ మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ ఏళ్ల తరబడి సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ కేసుల విచారణ నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక విధానపరమైన నిర్ణయంపై అభిప్రాయం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్ని నెలల సమయం తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటిదాకా అసలు కౌంటర్ దాఖలు చేయకపోవడానికి గల కారణాలేమిటో చెప్పాలని నిలదీశారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి 10 రోజుల గడువునిచ్చారు. ఆలోపు కేంద్రం కౌంటర్ దాఖలు చేయకుంటే…ఈ విషయంపై కేంద్రం చెప్పాల్సిందేమీ లేదని పరిగణిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల సత్వర విచారణ కోసం సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా కోర్టుల్లో పొలిటిషియన్లపై నమోదైన కేసులు ఏ దశలో విచారణలో ఉన్నాయన్న విషయాన్ని ఈ ప్రత్యేక ధర్మాసనం పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంది. జస్టిస్ ఎన్వీ రమణ ఆలోచనలో ఉన్న బెంచ్ అమలులోకి వస్తే జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ కూడా మరింత వేగవంతం అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ బెంచ్ ఏర్పాటైతే జగన్ కు తిప్పలు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.