తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పాలన్నట్లుగా వ్యవహరించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాల్లోని స్పీకర్ల మీద వస్తున్న విమర్శలకు తగ్గట్లే.. ఏపీ స్పీకర్ మీదా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన పదవీ కాలంలో వ్యవహరించిన తీరు.. ఆయన వ్యాఖ్యలపైనా పలువురు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అలాంటి ఆయన.. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వేళ తీసుకున్న నిర్ణయం ఆయన్ను ప్రశంసించేలా ఉంది. స్పీకర్ గా తమ్మినేని తీరు ఎలా ఉన్నా.. చివర్లో మాత్రం న్యాయం.. ధర్మం రెండింటిని పక్కాగా అమలు చేసినట్లుగా ఆయన తాజా నిర్ణయం ఉందని చెప్పాలి.
ఏపీకి చెందిన 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు. నిజానికి ఇప్పుడు వేటు వేయటం వల్ల ఒరిగే లాభం ఏమీ ఉండదు. ఇంతకాలం ఆయన నిర్ణయం తీసుకోనప్పటికీ.. ప్రభుత్వం చివరి రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేపై వేటు వేసిన ఆయన.. విపక్షానికి చెందిన రెబల్ ఎమ్మెల్యేలపైనా వేటు వేయటం ఆసక్తికరమని చెప్పాలి.
ఇంతకాలం న్యాయ నిపుణుల సలహా కోసమంటూ పెండింగ్ లో పెట్టిన వేటు నిర్ణయాన్ని ఆయన పూర్తి చేశారు. అధికార వైసీపికి చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఉండవల్లి శ్రీదేవిలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. అదే విధంగా తమ పార్టీకి చెందిన మద్దాల గిరి.. కరణం బలరామ్.. వల్లభనేని వంశీ.. వాసుపల్లి గణేశ్ లపై వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
తాజాగా అధికార.. విపక్ష పార్టీలు ఇచ్చిన పిటిషన్లపై విచారణ జరిపిన ఆయన.. హోల్ సేల్ గా ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం.. అందరిని సమ్మతం అనిపించేలా ఉండటం గమనార్హం. ఈ కారణంగానే.. గతం సంగతిని పక్కన పెడితే వర్తమానంలో మాత్రం తమ్మినేని అదరగొట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.