ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ, టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూల మధ్య మైక్ సమయం విషయంలో జరిగిన సంభాషణ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, తాను రఘురామతో వాగ్వాదం చేయలేదని, తనకు, ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని జ్యోతుల నెహ్రూ క్లారిటీనిచ్చారు. ఈ క్రమంలోనే అదే తరహాలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరో ఘటన హాట్ టాపిక్ గా మారింది.
చేనేత వస్త్రాల, చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సందర్భంగా స్పీకర్ రఘురామ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు మాత్రమే వేయాలని, సూచనలు చేస్తున్నారని అన్నారు. సూచనలను ప్రశ్నల మాదిరిగా మార్చుకొని వస్తే ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత మంత్రి సమాధానమిస్తారని చెప్పారు.
అది కూడా ఇప్పటికే చాలా సూచనలు చేశారని, సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా ముగించాలని కోరారు. అలాగే చేస్తానని మాధవి చెప్పారు. ప్రభుత్వానికి ఒక్క సూచన అంటూ ప్రభుత్వానికి మాధవి ఓ సూచన చేశారు. నెలలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా ప్రభుత్వ ఉద్యోగులకు సూచన చేస్తారా అని సభ ద్వారా ప్రభుత్వానికి సూచిస్తున్నానని మాధవి అన్నారు. దీనికి రఘురామ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీరు సభకు ఇప్పుడు చేనేత చీర కట్టుకొని వచ్చారా? మీ శారీ చేనేతేనా? అని రఘురామ ప్రశ్నించారు. అవును అధ్యక్షా చేనేత చీరే అని మాధవి నవ్వుతూ సమాధానమిచ్చారు. దానికి రఘురామ సంతోషం అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.