టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీ, తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా బాసటగా నిలిచారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వారంతా ఖండించారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు చంద్రబాబు అరెస్టును ఖండించి ఆయనకు మద్దతుగా నిలిచారు. వనస్థలిపురంలో చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుధీర్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆయన..ఆ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని, రాజకీయాల్లో ఇటువంటి తీరు సరికాదని హితవు పలికారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని అన్నారు. కాగా, మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్టును సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, కాంగ్రెస్ నేత మధుయాష్కీ అయితే చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్, మోడీ, జగన్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.