ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పునిచ్చారు. అయితే, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్ కోర్టుమెట్లెక్కారు. అయితే, వైసీపీ సభ్యులు సభకు వస్తే వారికి మాట్లాడే అవకాశమిస్తామని, కానీ, వారు సభకు రావడం లేదని టీడీపీ సభ్యులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని వైసీపీ ఎమ్మెల్యేలనుద్దేశించి అయ్యన్న పరోక్షంగా చురకలంటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే తప్పకుండా వారికి మాట్లాడే అవకాశమిస్తానని ఆయన అన్నారు. జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణా కార్యక్రమాలుంటాయని చెప్పారు.
శిక్షణలో భాగంగా రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యత వంటి విషయాలపై కొత్తగా ఎన్నికైన సభ్యులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి రోజులు వచ్చాయని. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్యన్నపాత్రుడు తెలిపారు.