చిత్తూరు జిల్లా పుంగనూరులో విపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిసిందే. చంద్రబాబు తీరును.. టీడీపీ నేతలు.. కార్యకర్తల వ్యవహారశైలిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. పుంగనూరులో చోటు చేసుకున్న పరిస్థితులకు పోలీసుల వైఖరే అన్న విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మొత్తంగా ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా మారిన పుంగూరు ఉదంతంలో మరో మలుపు చోటు చేసుకుంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలకు కారణం.. జిల్లాకు ఎస్పీగా వ్యవహరించిన రిషాంత్ రెడ్డేనన్న మాట వినిపిస్తోంది.
సోమవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఒక సంచలన ప్రెస్ మీట్ ను నిర్వహించారు నర్సీపట్నానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి. బీసీ సామాజిక వర్గానికి చెందిన అతను.. ఇప్పటి ఎస్పీ రిషాంత్ రెడ్డి తొలి బాధితుడ్ని తానేనంటూ సంచలన ఆరోపణ చేశారు. 2019లో నర్సీపట్నం అదనపు ఎస్పీగా పని చేసిన టైంలో ఆయన బారిన తాను పడినట్లుగా చెప్పారు. అప్పట్లోనే ఆయనపై చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడీ పరిస్థితులు ఉండేవి కాదన్నారు.
2019 సెప్టెంబరు నాలుగున నర్సీపట్నంలో టీడీపీ ప్రధానకార్యదర్శి బైక్ ర్యాలీలో తాను పాల్గొన్నానని.. ఆ టైంలో రిషాంత్ రెడ్డి తన వద్దకు వచ్చి.. ర్యాలీకి అనుమతి లేదు.. ఎందుకు పాల్గొన్నవని పరుషంగా మాట్లాడినట్లుగా చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబరు 13న నర్సీపట్నం పోలీసులు పట్టణ స్టేషన్ లోని పై అంతస్తులోకి తీసుకెళ్లి చీకటి గదిలో తనను ఉంచారన్నారు.
తనను కాళ్లతో తన్నారని.. కర్రలతో పాదాల మీద కొట్టి పరిగెత్తిస్తూ చిత్రహింసలు పెట్టినట్లు చెప్పారు. తన తలపై రివాల్వర్ పెట్టిన రిషాంత్ రెడ్డి.. తనను లేపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారన్నారు. తాను ఏ తప్పు చేయకున్నా.. బ్రతిమిలాడినా కూడా ఆయన కనికరించలేదన్నారు. బాధను తట్టుకోలేక పరిగెత్తే క్రమంలో పోలీస్ స్టేషన్ లోని మొదటి అంతస్తు నుంచి కిందకు పడి.. రెండు కాళ్లు విరిగినట్లుగా వాపోయారు. ఈ ఉదంతం జరిగిన తర్వాత పోలీసులు తనను పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా తీసుకెళ్లకుండా.. మరోవైపు ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. తమ కుటుంబ సభ్యులు తనను విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స చేయించారని.. ఆ సమయంలో తన కాళ్లకు రాడ్డు వేసి చికిత్స చేశారన్నారు. అప్పట్లో విశాఖ ఎస్పీ.. డీజీపీలకు తాను కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు. అనంతరం మానవ హక్కుల సంగంలోనూ.. కోర్టులోనూ కేసు వేయగా.. నివేదికను అడిగిన కోర్టుకు పోలీసులు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు.
మానవ హక్కుల కమిషన్ స్పందించి.. పెద్ద వయసులో ఉన్న తన తల్లికి పోషణ నిమిత్తం పోలీసు శాఖ నుంచి రూ.2 లక్షలు ఇప్పించినట్లుగా పేర్కొన్నారు. రిషాంత్ రెడ్డి మీద అప్పట్లోనే చర్యలు తీసుకొని ఉంటే.. ఈ రోజున పుంగనూరులో అలాంటి పరిస్థితి ఏర్పడి కాదన్నారు. రిషాంత్ కారణంగా ఇంకెవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.