దాడి వేళ కొడాలి నాని పీఏకు ఎస్పీ పరామర్శ.. దగ్గరుండి కేసు నమోదు!
కొందరి అదృష్టం అలా ఉంటుంది మరి. చేతిలో అధికారం లేకున్నా చెలరేగిపోతుంటారు. అలాంటి వారి జాబితాలో చేరుతారు మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ సర్కారులో కీలక భూమిక పోషించిన ఆయన.. నాటి విపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు తిట్టేవారు.
బూతులతో చెలరేగిపోయేవారు. మాటకు ముందు ఒక బూతు.. మాట చివర్లో మరో బూతు మాత్రమే కాదు.. మధ్యలోనూ ఆయన మాటలన్ని బూతులతో నిండేవి. అలాంటి కొడాలి నాని.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కామ్ గా ఉంటున్నారు. పేరుకు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. తన పనుల్ని తాను చేసుకుంటూ వెళుతున్నారని.. ప్రభుత్వం మారినా.. అధికారం చేతిలో లేకున్నా.. ఆయన మాట చెల్లుబాటు అవుతున్న తీరుకు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆసూయ పడుతున్న పరిస్థితి.
ఇటీవల కొడాలి నాని పీఏ లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే.. తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు సైతం లక్ష్మోజీ కంప్లైంట్ చేయలేదు. అయితే.. క్రిష్ణా జిల్లా ఎస్పీగా జులై 17న బాధ్యతలు చేపట్టిన గంగాధర్.. తానే స్వయంగా వెళ్లి లక్ష్మోజీని పరామర్శించటం హాట్ టాపిక్ గా మారింది. కొడాలి నాని ఆదేశాలతోనే ఎస్పీ తరలివచ్చారంటున్నారు. ఒక ఎమ్మెల్యే కూడా కాని నేత చెబితే.. ఒక జిల్లా ఎస్పీ ఎలా వస్తారని.. అది కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత మాటకు ఎస్పీ అంతటి ప్రాధాన్యత ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
ఈ సీన్ ఇక్కడితో అయిపోలేదు. తానే దగ్గరుండి.. కొడాలి నాని పీఏపై దాడి చేసిన వైనంపై కేసు కట్టించి వెళ్లారంటున్నారు. ఏమైనా.. క్రిష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. అదే సమయంలో కొడాలి నాని హవా ఎంతలా నడుస్తుందన్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.