ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ ఆలయంలోని రత్న భాండాగారాన్ని ఈ రోజు తెరిచిన సంగతి తెలిసిందే. ఆలయంలోని ఈ రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత తెరిచారు. ఆలయ అర్చకులు, ప్రభుత్వ అధికారులు , పోలీసుల సమక్షంలో ఈ గదిని ఓపెన్ చేశారు. ఆలయంలోని రత్న భాండాగారంలో భద్రపరిచిన జగన్నాథ స్వామి, సుభద్ర, భలభద్రలకు చెందిన విలువైన ఆభరణాలను వేరేచోటికి తరలించారు. సిబ్బంది ఆ గదిని శుభ్రం చేస్తున్న సందర్భంగా రత్న భాండాగారం సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది.
ఆలయ గదిలో విషపు వాయువులు, విష సర్పాలు ఉంటాయన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎస్పీ అనారోగ్యానికి గురవ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత వెంటనే ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆ తర్వాత రత్న భాండాగారంలో నిధిని తరలించేందుకు పెద్ద చెక్క పెట్టెలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ ఆభరణాలను ప్రత్యేక వాహనంలో పూరీ ఆలయం వద్దకు చేర్చారు. 12వ శతాబ్దంలో నిర్మించిన పూరీ ఆలయంలో ఆ భాండాగారాన్ని తెరిచే ముందు కీలకమైన క్రతువు ‘ఆజ్ఞ’ను నిర్వహించారు. ఆ రహస్య గదిని తెరిచేటపుడు పాములు పట్టే బృందాలను కూడా మోహరించారు.