మన దేశంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సరైన పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడమనేది ఓ ప్రహసనం అనే చెప్పాలి. డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేయడం మొదలు…ఎల్ఎల్ఆర్ పొందడం….ఆ తర్వాత ఆర్టీవో అధికారుల సమక్షంలో అనకొండలాగా వాహనంతో ‘8’ వేయడం…ఇలా నిఖార్సుగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసుకొని….ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ చేతికి రావడం అనేది చాలా సమయం పట్టే ప్రక్రియ. అయితే, దొడ్డిదారిలో లైసెన్స్ తెచ్చుకోవాలంటే అంత ప్రాసెస్ ఉండకపోవచ్చన్నది వేరే సంగతి.
ఈ నేపథ్యంలోనే ఇకపై లైసెన్స్ పొందే ప్రహసనానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేసే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టునుంది. త్వరలోనే డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలలోనే డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేసేలా మార్గదర్శకాలు రూపొందించనుంది. ఈ ప్రకారం డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ ఇచ్చేందుకు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్రం తాజా ప్రకటనతో ఇకపై డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ధృవీకరిస్తే డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. అయితే, ఎలా పడితే అలా నచ్చినవారికి శిక్షణా కేంద్రాల వారు లైసెన్స్ లు ఇస్తామంటే కుదరదు. ఆయా డ్రైవింగ్ స్కూళ్లు తగిన అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థ, నిబంధనలు పాటిస్తేనే ఈ అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించడం, లక్ష్యంగా కేంద్రం ఈ కొత్త ఒరవడికి తెరలేపింది.
ఇందుకోసం, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలు ఉండేలా ముసాయిదాను రూపొందించింది. ఆ అర్హతలున్న డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లో డ్రైవర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి లైసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే లక్ష్యంతో సరికొత్త విధానాలను రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.