భారత దేశ రాజకీయ చరిత్రలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించిన అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ దార్శనీకుడు చంద్రబాబు. తెలుగునాట ఐటీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.
ఐటీ రంగంలో చంద్రబాబు విశేష కృషికి నిలువెత్తు తార్కాణం హైటెక్ సిటీ. భారీ వేతనాల తో కూడిన లక్షలాది ఉధ్యోగాలు,ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈరోజు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాటి చంద్రబాబు కృషే కారణం. బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశం మొత్తం అంగీకరిస్తుంది. అటువంటి విజనరీ హీరో చంద్రబాబుపై రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ప్రశంసల జల్లు కురిపించారు.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని సోనూసూద్ కొనియాడారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సోనూసూద్ ప్రశంసలు కురిపించారు. ఆనాడు హైదరాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు జంటనగరాలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో తమ ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ రియల్ హీరో అన్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు లాంటివి అని, తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలతో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని, కోవిడ్ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తుండటం ఎంతో సంతృప్తినిస్తోందని సోనూసూద్ చెప్పారు. ఆపదలో ఉన్నవారికి సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నానని వెల్లడించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సోనూసూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సోనూసూద్ రియల్ హీరో అంటూ చంద్రబాబు కితాబిచ్చిన సంగతి తెలిసిందే.