ఎవరీ నెల్లూరు నాగలక్ష్మీ.. దేశంలోనే అత్యంత ధనవంతురాలని సోనూ ఎందుకన్నారు?
తోటి మనిషికి సాయం చేయటానికి మించిన పెద్ద మనసు ఏముంటుంది? ఎలాంటి కష్టం లేనప్పుడు సాయం చేయటానికి చాలా మందికి చేతులు రావు. కానీ.. తాము కష్టంలో ఉన్నప్పుడు సాయం పొందటానికి వెనుకాడరు. అయితే.. సాయం చేసే మనసులు ఎన్నో ఉన్నా.. అలాంటి వారిని తట్టి లేపే వేదికలు కొన్నే ఉంటాయి. సరైన సంస్థకు తాము సాయం చేస్తున్నామన్న నమ్మకం కుదిరితే.. సాయం చేసేందుకు చాలామందే వస్తారు. అలాంటి కోవకే చెందుతారు నెల్లూరు నాగలక్ష్మీ.
ఇప్పటివరకు ఆ ఊరు వారికి కూడా సరిగా తెలీని ఆమె పేరు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియటమే కాదు.. ఆమె చేసిన పనికి శభాష్ అనేస్తున్నారు.
ఇంతకీ.. నెల్లూరు నాగలక్ష్మికి అంతటి క్రేజ్ రావటానికి కారణం.. ప్రముఖ నటుడు సోనూసూద్ చేసిన పోస్టే కారణమని చెప్పాలి.
కష్టంలో ఉన్నానంటూ సాయం కోసం చేతులు జాస్తే చాలు.. అందుకోసం కొండ మీద ఉన్న కోతిని అయినా కిందకు దించి.. వారి కష్టాన్ని తీర్చే మనసున్న మారాజుగా మారిన సోనూసూద్ ఫౌండేషన్ కు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడుకు చెందిన నాగలక్ష్మీ అనే మహిళ తాను దాచుకున్న రూ.15వేల మొత్తాన్ని విరాళంగా పంపారు.
దీనికి స్పందించారు సోనూసూద్.
యూట్యూబర్ గా వ్యవహరించే ఆమెకు కళ్లు కనిపించవు.
తానే ఒకరి సాయంగా ఉండాల్సిన స్థానే.. అందుకు భిన్నంగా తాను వేరే వారికి చేతనైనంత వరకు సాయం చేయాలని భావించారు.
అందులో భాగంగా సోనూసూద్ చేస్తున్న ఫౌండేషన్ కార్యక్రమాల సహాయం కోసం తన ఐదు నెలల పెన్షన్ డబ్బుల్ని పంపినట్లుగా పేర్కొన్నారు. ఈ దేశంలో అత్యంత ధనవంతురాలు ఆమెనని ప్రశంసలు కురిపించిన ఆమె.. నాగలక్ష్మికి స్వయంగా ఫోన్ చేశారు. ఆమెను అభినందించారు. వేరే వారి బాధను చూడటానికి నేత్రాలు అవసరం లేదని.. ఆమె అసలుసిసలు హీరో అని కొనియాడారు.
ఐదో క్లాస్ వరకు మాత్రమే చదివిన నాగలక్ష్మి.. సోనూ చేసే కార్యక్రమాలకు ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి.. రియల్ లైఫ్ లో అసలుసిసలు హీరోలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. తనకు హిందీ రాదని.. మాట్లాడలేనని చెప్పిన ఆమె మాటల్ని.. వేరే వారు సోనూకు చెప్పారు.
నాగలక్ష్మి మాటలకు స్పందించిన సోనూ.. తాను ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తానని చెప్పటంతో.. ఆమె పొంగిపోయారు. ఆ రోజుకు కోసం ఎదురుచూస్తామని పేర్కొన్నారు.
వీరిద్దరి సంభాషణ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.