కాంగ్రెస్ పార్టీలో నేతలకు కొదవలేదు. కానీ.. అధినేతగా గాంధీ ఫ్యామిలీ తప్పించి మరెవరూ ఉన్నా కానీ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ వాదనలో నిజం ఎంతన్న విషయాన్ని గడిచిన పాతికేళ్ల కాలాన్ని చూస్తే అర్థమవుతుంది. సోనియాగాంధీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలగటం.. అదే సమయంలో అధికారాన్ని కోల్పోయిన దారుణ పరిస్థితిని ఎదుర్కోవటం రెండు చూసిందే. సోనియా చేతిలో పగ్గాలు ఆమె కుమారుడు రాహుల్ చేపట్టటం.. అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవటం.. తన పదవికి రాజీనామా చేయటం గతం. చివరకు వెతగ్గా.. వెతగ్గా.. మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యూపీఏ ఛైర్ పర్సన్ గా.. ఎంపీగా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ తాజాగా రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో సంచలన వ్యాఖ్య చేశారు.
భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తి కానుందన్న విషయాన్ని ఆమె పేర్కొన్నారు. ‘‘భారత్ జోడో యాత్రతో నా రాజకీయ ఇన్నింగ్స్ ముగియనుండటం సంతోషాన్ని కలిగించే అంశం. దేశాన్ని మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం.. సహనం.. సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది’’ అని పేర్కొన్నారు. సోనియా చేసిన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయరా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతను మల్లికార్జున ఖర్గేకు అప్పజెప్పినప్పటికీ.. పార్టీకి కష్టం వచ్చినప్పుడు అన్నీ విషయాల్ని చూసుకునే బాధ్యతను ఆమె నిర్వహిస్తున్నారు.
తాజాగా జరుగుతున్న ప్లీనరీలో ప్రసంగించిన ఆమె మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో ఆనందాన్ని.. సంతప్తిని కలిగించాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యవస్థను బీజేపీ – ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకొని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్ది మంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించటం దేశ ఆర్థిక పతనానికి కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. అది దేశ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందన్నారు. అందరి కలల్ని సాకారం చేస్తుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థల్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బీజేపీ విద్వేషాగ్నిని రాజేస్తుందని.. మైనార్టీలు.. మహిళలు..దళితలు.. గిరిజనులను లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. 2024లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు. ఇక.. సోనియా నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యను చూస్తే.. క్రియాశీల రాజకీయాలకు ఆమె గుడ్ బై చెప్పనున్నారన్న విషయాన్ని తెలియజేసినట్లేనని చెబుతున్నారు.76 ఏళ్ల వయసున్న సోనియా గడిచిన కొన్నేళ్లుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా నిర్వహించిన ప్లీనరీలో 15వేల మంది కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు.