ఇండియన్ నేషనల్ కాంగ్రెస్….స్వతంత్రానికి పూర్వం స్థాపించిన పార్టీ….133 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన పార్టీ……దేశానికి ఎందరో కీలకమైన నేతలను అందించిన పార్టీ…..అయితే, గత చరిత్ర ఘనంగా ఉన్న ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం చుక్కాని లేని నావలా తయారైంది. కాంగ్రెస్‌ను నడిపించే బలమైన నాయకత్వం లేక పార్టీ కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ల వారసత్వాన్ని తాను కొనసాగించలేనంటూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ససేమిరా అంటున్న వైనం కాంగ్రెస్ లీడర్స్, కేడర్‌ను కలవరపెడుతోంది.
ఇక, వయోభారంతో మరోసారి అధ్యక్షురాలయ్యేందుకు సుముఖత చూపకపోవడం….రాహుల్‌ను కాదని ప్రియాంకాకు పగ్గాలు అప్పజెప్పేందుకు సోనియా సుముఖంగా లేకపోవడం….ఇవన్నీ కాంగ్రెస్ నాయకత్వంతోపాటు కార్యకర్తలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీయేతర వ్యక్తికి అప్పగిస్తే బాగుంటుందన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో, అనేక తర్జన భర్జనలు, ఓటింగ్ ల నడుమ కాంగ్రెస్ వీర విధేయుడు, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈ క్రమంలోనే పార్టీలో సోనియా గాంధీ పాత్ర ఏమిన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ క్రమంలోనే తాజాగా తన పొలిటికల్ కెరీర్ గురించి సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నారా? అంటే అవుననే సమాధానం ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి వస్తోంది. చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ తన పొలిటికల్ రిటైర్మెంట్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసే అవకామశముందని సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అయ్యే అవకాశముందని సోనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సామరస్యం, సహనం, సమానత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, భారత్ జోడో యాత్రతో ఈ విషయం తెలిసిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది సవాళ్లతో కూడుకున్న సమయం అని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దేశంలోని సంస్థలను నిర్వీర్యం చేస్తూ కొందరు వ్యాపారవేత్తలకు మద్దతివ్వడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని అదానీని ఉద్దేశించి సోనియా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.