తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణా నుండి సోనియాగాంధీని పోటీచేయించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. తొందరలోనే ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడి పోటీకి ఒప్పించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటి సమావేశం నిర్ణయించింది. సోనియాను ఖమ్మం, నల్గొండ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కడైనా పోటీచేయించచ్చని కూడా అనుకున్నది. పార్టీ తాజా తీర్మానాన్ని వెంటనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కీలక నేతలకు చేరవేసినట్లు సమాచారం.
తెలంగాణా కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సోనియా పోటీ చేస్తారా లేదా అన్నది తెలీదు. ఎందుకంటే ఇప్పటికే అనారోగ్య కారణాలతో సోనియా బాగా ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అసలు సోనియా పోటీచేస్తారా లేదా అన్నది కూడా అనుమానమే. నిజానికి సోనియా పోటీచేయాలని అనుకుంటే నియోజకవర్గం వ్యాప్తంగా తిరగాల్సిన పనిలేదు. నామినేషన్ వేసి కూర్చుంటే మిగిలిన పనులను మిగిలిన నేతలు చూసుకుంటారు. కానీ రాబోయే ఎన్నికల్లో అలా పనిజరగదు. ఎందుకంటే లోక్ సభలో బలం పెంచుకోవటం కాంగ్రెస్ కు చాలా అవసరం.
అందుకనే సోనియాను తెలంగాణాలో పోటీచేయించాలన్న తీర్మానం వెనుక పెద్ద వ్యూహమే ఉందట. అదేమిటంటే సోనియా గనుక ఇక్కడ పోటీచేస్తే దాని ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపు మీద కూడా పడుతుందని కాంగ్రెస్ అనుకుంటున్నది. పోటీచేయబోయే నియోజకవర్గానికి మాత్రమే సోనియా పరిమితమవ్వరు కదా. అవకాశమున్నంతలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయిస్తారు. సోనియా పోటీచేస్తారు కాబట్టి కచ్చితంగా రాహుల్, ప్రియాంకలు తెలంగాణాపైన ప్రత్యేక దృష్టి పెడతారు. అప్పుడు అన్నీ నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ ఊపు పెరుగుతుందని అనుకుంటున్నారు.
ఒకవేళ సోనియా పోటీచేయకపోతే ప్రియాంక గాంధీనైనా పోటీలోకి దింపాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రియాంక పోటీచేస్తే ఇంకా మంచిదట. ఎందుకంటే తాను పోటీచేయబోయే నియోజకవర్గంతో పాటు మిగిలిన 16 నియోజకవర్గాల్లోను ప్రియాంక ప్రచారం చేస్తారని అనుకుంటున్నారు. అప్పుడు మెజారిటి సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయన్నది పార్టీ నేతల అంచనా. మొత్తం 17 సీట్లలో కనీసం 10 నియోజకవర్గాల్లో అయినా గెలవకపోతే రేవంత్ కు పరువు దక్కదు.