రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజులుగా ఈ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిజెపి, టిడిపిల మధ్య పొత్తు ఉండే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాను బిజెపితోనే ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.
అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా తాను ముందుకు వెళ్తానని చెబుతున్నారు. అంటే, టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ నాన్చుడు ధోరణిలో డీల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోము వీర్రాజుకు మీడియా ప్రతినిధుల నుంచి ఆసఃక్తికర ప్రశ్న ఎదురైంది. టిడిపి, బిజెపి లపై పొత్తుపై ప్రశ్నకు సోము షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉంటుందా అని ప్రశ్నించిన విలేకరిపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.
ఈ పొత్తు విషయం గురించి వెళ్లి చంద్రబాబునాయుడు అడగండి..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, ఈ సందర్భంగా సీఎం జగన్ పై సోము సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అలా చేస్తున్న జగన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని సెటైర్ వేశారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు చేయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని సోము తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోము వ్యాఖ్యలపై టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.