ఏపీలో కొంతకాలంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత రావడంతో వైసీపీ నేతలు దిగాలుపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ బలపడుతోంది. దీంతో, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జతకట్టేందుకు ఏపీ బీజేపీ పావులు కదుపుతోంది. చంద్రబాబుతో పొత్తుకు కేంద్రం నుంచి కూడా పరోక్ష సంకేతాలు రావడంతో టీడీపీతో దోస్తీకి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దారులు వెతుకుతున్నారు.
టీడీపీతో స్నేహానికి బీజేపీ పాకులాడుతోందనడానికి చంద్రబాబు గురించి సోము చేసిన తాజా కామెంట్లే నిదర్శనం. టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు దార్శనికుడు అని, అందుకే, 2014లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతికి రూ. 8500 కోట్లు నిధులిచ్చేందుకు సిద్ధపడిందని అన్నారు.
జగన్ దార్శనికుడు కాదని, అందుకే 3 రాజధానులకు నిధులివ్వడం లేదని సోము జగన్ గాలి తీశారు. బీజేపీతో దూరంగా ఉంటున్న చంద్రబాబుపై తాజాగా సోము చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబుకు దక్కిన కీలక ప్రశంసతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం అందడం కూడా మరో సంకేతం.
తాజా పరిణామాలు, కామెంట్ల నేపథ్యంలో జగన్ కు భయం పట్టుకుందట. తమకు వ్యతిరేకంగా సోము వ్యాఖ్యలతో జగన్ బెంగపడుతున్నారట. అంతేకాదు, వీర్రాజు స్వరం మారుతుంటే జగన్ కు చెమటలు పడుతున్నాయట. వీర్రాజు, బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏం మాట్లాడినా తన కేసుల వ్యవహారం బయటపడుతుందని భయపడుతున్నారట జగన్. అందుకే, తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలకు వైసీపీ నేతలు గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్నారట.