రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ-జనసేన గెలిస్తే బీసీయే సీఎం అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ప్రకటన రాజకీయంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. సోము ప్రకటనపై జనసేన నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. సోము వ్యాఖ్యల వల్ల బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందని జనసేన నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై సోము యూటర్న్ తీసుకున్నారు. తూచ్…తాను బీసీ సీఎం అనలేదంటూ మాట మార్చారు. బీసీని సీఎం చేస్తానని తాను చెప్పలేదని, కొందరు తన మాటలను వక్రీకరించారని మాట మార్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, జనసేన అధినేత పవన్ కలిసి సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తారని సోము యూటర్న్ తీసుకున్నారు. బీసీ అయిన మోడీని బీజేపీ ప్రధానిని చేసిందని తాను అన్నానని, వైసీపీ, టీడీపీలు బీసీని సీఎం చేయగలవా అని తాను ప్రశ్నించానని సోము అన్నారు. సీఎం అభ్యర్థి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని సోము సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ సకల జనుల పార్టీ అని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, బీసీనే సీఎం అంటూ సోము చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ ….బీజేపీ పెద్దలతో చర్చించినట్టు పుకార్లు వస్తున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నిక విషయంలోనూ సోము తొందరపడి ప్రకటన చేశారని బీజేపీ పెద్దలకు పవన్ ఫిర్యాదు చేశారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీ, జనసేనల మధ్య గ్యాప్ వచ్చిందని స్వయంగా పవన్ ఒప్పుకున్నారు. ఇపుడు, తాజాగా సోము ప్రకటనతో పవన్ అసహనం వ్యక్తం చేశారని, దీంతో, బీజేపీ పెద్దలు సోముకు సుతిమెత్తగా హెచ్చరించడంతోనే తనకు సీఎం అభ్యర్థిని ప్రకటించే అధికారం లేదంటూ మాటమార్చారని టాక్ వస్తోంది. అసలు అధికారమే లేనపుడు సోము ఆవేశంగా ప్రకటన చేయడం ఎందుకు…ఆ తర్వాత అధిష్టానంతో చీవాట్లు తిని మాట మార్చడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా, భవిష్యత్తులో సోము ఈ తరహా ప్రకటలను మరిన్ని చేస్తారా…లేక గత అనుభవాల రీత్యా సైలెంట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.