ఎందుకు మాట్లాడతారో? ఏ లెక్కలు వేసుకొని గొంతు విప్పుతారో తెలీదు కానీ.. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు గురించి తెలిసిందే. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడే కన్నా.. ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడే స్పెషాలిటీ సోము ప్రత్యేకతగా చెప్పాలి. 2014లో టీడీపీ- బీజేపీ- జనసేన ఉమ్మడి సర్కారు సమయంలోనూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఘాటుగా రియాక్టు అయ్యే ఆయన.. ఎప్పుడు ఏ రీతిలో రియాక్టు అవుతారో అంచనాలకు అందని రీతిలో ఆయన తీరు ఉంటుంది.
తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తే జనసేన పార్టీతోనూ.. లేదంటే ఒంటరిగా పోటీ చేయటానికి సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సోము. ఒకపక్క వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నం చేస్తానని.. జనసేన అధినేత అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా సోము మాటలు ఉండటం కలకలం రేపుతోంది.
2014లో ఏ కూటమి అయితే ఉందో.. అలాంటి కూటమిని రిపీట్ చేయటం ద్వారా జగన్ సర్కారును దెబ్బ తీయొచ్చన్న వాదన వినిపిస్తున్న వేళ.. టీడీపీతో పొత్తు అంశం దాదాపుగా లేనట్లుగా సోము తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అరకలోయలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ.. టీడీపీలకు సమ దూరాన్ని పాటిస్తామని సోము స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనసేనానికి షాకిచ్చేలా సోము మాటలు ఉన్నాయి.
అయితే..తమతో కలిసి పోటీ చేయాలన్న సోము వ్యాఖ్యలపై పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ప్రశ్నగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైనే సమయం ఉన్న నేపథ్యంలో..సోము చేసిన వ్యాఖ్యలు తొందరపాటుతో కూడుకున్నవిగా చెబుతున్నారు. మొత్తంగా సోము చేసిన తాజా వ్యాఖ్యలు జనసేనానిని టార్గెట్ చేసిన చందంగా ఉన్నట్లుగా చెప్పక తప్పదు.