కర్నూలు జిల్లాలో హనుమాన్ శోభాయాత్రలో హింసాత్మక ఘటనలు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. హనుమాన్ శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడి జరిపారని ఆరోపణలు వస్తుున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. మీకు చలనం లేదా? అసాంఘిక శక్తులను పెంచి పోషించి రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? అంటూ జగన్ పై సోము మండిపడ్డారు. ఓట్ల కోసం మీరు వహిస్తున్న మౌనం మత కల్లోలాలకు దారితీస్తుంటే మీ కళ్లకు కనిపించడంలేదా? అని జగన్ ను నిలదీశారు.
“ప్రజలకు రక్షణ కల్పించలేని వాడు సమర్థవంతమైన పాలకుడు ఎలా అవుతాడు? మీ అసమర్థత కారణంగా ఇంకెంతమంది హిందువులు రక్తం చిందించాలి?” అంటూ జగన్ పై సోము నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలను గృహనిర్బంధాల ద్వారా కట్టడి చేయడంలో అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న పోలీసుల తీరుపై కూడా సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుల రక్షణను గాలికొదిలేసే పాలన మీకు మాత్రమే సొంతం జగన్ గారూ అంటూ సోము చురకలంటించారు.
పరిస్థితులను కట్టడి చేసే సామర్థ్యం లేకపోగా, ప్రశ్నించే తమపై మత రాజకీయ ముద్ర వేయడం ఎంతవరకు ఆమోదయోగ్యం అని జగన్ ను సోము ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే మొద్దు నిద్రను వీడి శోభాయాత్రపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని సోము డిమాండ్ చేశారు. లేకపోతే, తదుపరి పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. తమకు ప్రభుత్వం అండ ఉందనే భావనతో కొన్ని వర్గాల వికృత చేష్టలకు అమాయక హిందువులు బలైపోతున్నారని సోము ఆవేదన వ్యక్తం చేశారు.
“అధికార పార్టీ ఎమ్మెల్యేలే టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తారు. జిన్నా టవర్ విషయంలోనూ, శ్రీశైలంలో దేవస్థానంలో అన్యమతస్తుల వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి హిందూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం నుంచి హిందువులు ఇంతకంటే ఇంకేం ఆశించగలరు? జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో నేను పర్యటిస్తా. ప్రజాక్షేత్రంలో మీ నిరంకుశ వైఖరిని ఎండగడతా” అంటూ జగన్ కు సోము డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.