నిత్యం జగన్ భజన చేస్తూ … జగన్ కి ఏ మాత్రం నష్టం జరిగే విమర్శ చేయాల్సి వచ్చినా… దానికి పది రెట్లు చంద్రబాబును డ్యామేజ్ చేసేలా సంబంధం లేని విమర్శలు చేసే సోము వీర్రాజు ఇపుడు దిక్కుతోచక తడుముకుంటున్నారు. ఆంధ్రజ్యోతి మీడియాను బెదిరించబోయిన సందర్భంలో రాధాకృష్ణకు చిర్రెత్తుకు రావడంతో… ఏపీకి చెందిన నలుగురు బీజేపీ నేతలు జగన్ కి ఎలా సేవలు చేస్తున్నారో ఆయన ఎండగట్టారు. ఆ నలుగురిలో సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఆర్కే వీరి బండారం బయటపెట్టినప్పటి నుంచి సోము వీర్రాజు కాస్త వెనక్కు జంకారు. అది తాత్కాలికమేనా శాశ్వతమా అన్నది ముందు ముందు తెలుస్తుంది. తాజాగా జగన్ మీద సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.
‘‘వైసీపీ నేతల బెదిరింపులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భయపడరు అని సోము వీర్రాజు హెచ్చరించారు. సీఎం జగన్ కు బుద్ధి చెప్పే సమయం వచ్చేసిందన్నారు. వైసీపీ దౌర్జన్యాలను, అరాచకాలను ఎదుర్కోగల ధైర్యం ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని’’ సోము ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు. ఆయన అన్నమాట నిజమే గాని అది సోము గుండెల్లో నుంచి వచ్చిన మాట కాదు, బీజేపీ కేంద్ర నేతలకు జగన్ తప్పులను ఎత్తిచూపే ఉద్దేశమూ లేదని అనేక ఉదాహరణలు నిరూపించాయి.
తాజా ఎన్నికలలో వైసీపీ తీరుపై సోము వీర్రాజు పలు ఆరోపణలు చేశారు. వివిధ ఎన్నికలలో వైసీపీ సాధించిన విజయాల్లో నైతికత లేదన్నారు. దౌర్జన్యాలకు పాల్పడకుండా ఒక్క ఎన్నికలోను వైసీపీ గెలవలేదన్నారు. తిరుపతి ఉపఎన్నిక గురించి తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులపై కూడా ఈ సందర్భంగా సోము వీర్రాజు మండిపడ్డారు. అధికారులు వైసీపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.
ఇక తిరుపతి ఉపఎన్నికలో గెలుపు మాదే అని ఆయన వాస్తవదూరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతిలో నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన బీజేపీ ఎంపీ అభ్యర్థినే గెలిపించుకుంటాం అనడం విచిత్రం. ఎలా గెలుస్తారయ్యా అంటే…. ప్రధాని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోనే వారు తిరుపతిలో గెలుస్తారట. ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల ముంగిట …. ప్రత్యేక హోదాా హామీ ఇచ్చి దగా చేసిన మోడీకి కచ్చితంగా తిరుపతి ప్రజలు ఓటేయాల్సిందే మరి.