కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థమే కాదు. అమాయకత్వమో, గందరగోళమో ఏమో కానీ వాళ్ల మాటలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక జాతీయ పార్టీకు చెందిన రాష్ట్ర నాయకులు కొన్నిసార్లు చెప్పే మాటలు.. పార్టీనే ఇరుకున పెట్టేవిగా ఉంటాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇలాగే ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఆయన మాటలు అయోమయంగా కనిపిస్తున్నాయి.
నష్టాల్లో ఉందన్న కారణంతో విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయంపై ఎన్ని విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గది లేదని స్పష్టం చేసింది. ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పాటు తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంటును వదులుకోమని తెగేసి చెప్పారు. ఈ విషయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతిచ్చింది. ఎంత వ్యతిరేకత వచ్చినా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంటు విక్రయానికి ఏర్పాట్లను కేంద్రం వేగవంతం చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచే టెండర్లను ఆహ్వానిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 28వ తేదీ వరకు బిడ్ సమర్పణకు ఆఖరి తేదీగా కూడా నిర్ణయించింది. 29వ తేదీన సాంకేతిక బిడ్లను ప్రకటిస్తామని పేర్కొంది. టెండర్లలో ఎంపికైన కంపెనీకి తక్షణమే స్టీల్ ప్లాంటును అప్పగించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను ఆపుతామని ఏపీ బీజేపీ నేతలు చెప్పడం గమనార్హం.
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ జరగదని, స్టీల్ ప్లాంటును కాపాడే బాధ్యత ఏపీ బీజేపీ తీసుకుంటుందని సోము వీర్రాజు తాజాగా పేర్కొన్నారు. మరోవైపు దీనితో సంబంధం లేకుండా మరో వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు కోసం పోరాటం చేస్తున్న నాయకులు గతంలో డెయిరీలు స్పిన్నింగ్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేసినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఇలా ఒకేసారి వీర్రాజు రెండు రకాలుగా మాట్లాడడంపై విస్మయం వ్యక్తమైంది. దీంతో ఆయన ఏం చేప్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలపైనా ఆయన వింత వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతోందని ఈ దీనస్థితి చూసి బీజేపీ ఆవేదన చెందుతోందని ఆయన చెప్పడం గమనార్హం.
ఇంధన ధరలు కేంద్రానికి ఆదాయ వనరు కాదని వీర్రాజు చెప్పడంతో మరి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు నియత్రించలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ధరలు ఎవరు పెంచుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో పార్టీ నేతలు ఒక రకంగా చెప్తుంటే.. ఇక్కడ రాష్ట్ర నాయకులు అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను పిచ్చివాళ్లను చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక వీర్రాజు వ్యాఖ్యలపై జాతీయ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.