కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ దీక్షలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్లపై ఇప్పటికీ సెటైర్లు పేలుతున్న సంగతి తెలిసింద. ఏ ముహూర్తాన సోము ఆ కామెంట్లు చేశారోగాని…అప్పటి నుంచి ఇప్పటివరకు తగ్గేదేలే అంటూ వరుసగా ఒకదానిని మించి మరొకటిగా వరుస ఆణిముత్యాలతో రెచ్చిపోతున్నారు.
ఏపీలోని కోటి మంది తాగుబోతులంతా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని, బీజేపీ గెలిస్తే రూ.50కే క్వార్టర్ లిక్కర్ బాటిల్ ఇస్తామని సోము చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో, సోమును సారాయి వీర్రాజు అంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో, ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే క్రమంలో సోము తాను సారాయి వీర్రాజును కాదని బియ్యం వీర్రాజును, సిమెంటు వీర్రాజుని, కోడిగుడ్ల వీర్రాజును అంటూ నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
ఇక, దాదాపు 8 దశాబ్దాలుగా గుంటూరులో ఉన్న జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చిన సోము…తాజాగా విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిపై పడ్డారు. ఆ ఆస్పత్రి పేరును మార్చాలని సోము తాజాగా డిమాండ్ చేస్తున్నారు. అసలు కింగ్ జార్జ్ ఎవరని, ఇందులో కింగ్ ఎవరని? జార్జ్ ఎవరు? అని ప్రశ్నించారు. కింగ్ జార్జ్ పేరు బదులుగా తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇక, ధవళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన సర్ ఆర్థర్ కాటన్‌తో పాటు వీరన్న అనే ఇంజినీర్‌నూ స్మరించుకోవాలని కొత్త వాదనను సోము తెరపైకి తెచ్చారు. ఇక, తాను చేసిన ప్రతి డిమాండ్‌ను, హామీని 2024లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెడతామని సోము వీర్రాజు చెప్పడం కొసమెరుపు. ఇవన్నీ జరుగుతాయా…బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తుందా అంటే…ఏమో గుర్రం ఎగరావచ్చు…సోము సీఎం కానూ వచ్చు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇకనైనా సోము ఆణిముత్యాలు ఆపుతారో…లేక మరిన్నింటిని జనం మీదికి వదిలి వైరల్ అవుతారో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.