ఏపీ బీజేపీలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా? ఇక్కడ కీలక పదవుల్లో మార్పు ఖాయమనే సంకేతా లు వస్తున్నాయా? అంటే.. కమలం పార్టీ ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఔననే సమా ధానమే వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ.. వచ్చే 2024 ఎన్నిక లపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితిలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో అందునా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని నిర్ణయించుకుంది. అయితే.. నిన్న మొన్నటి వరకు ఆశించిన విధంగా రెండు రాష్ట్రాల్లో ఫలితం దక్కలేదు. కానీ, తాజాగా తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ ఎస్‌ను చావు దెబ్బ కొట్టడంతో కమల నాథుల్లో ఆశలు పెల్లుబికాయి.
ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణలో పాగా వేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ సాధనలో తాము భాగ స్వాములమే కాబట్టి.. ఆదిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పైగా దుబ్బాకలో బీజేపీ గెలుపు వెనుక ఉన్న అవకాశాలు.. ఇతర అంశాలను పరిశీలిస్తే.. యువత పాత్ర కీలకంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు.. బీజేపీ గెలుపులోను, ముఖ్యంగా టీఆర్ ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకును సాధించడంలోను కీలక పాత్ర పోషించారు. సంస్థాగతంగా ఉన్న బీజేపీ నేతలతో కలిసి.. కొత్తగా వచ్చిన వారు దూకుడు చూపించారు. ఇది బాగా కలిసివచ్చింది.
దీంతో మున్ముందు తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఈ పరిణామాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోం ది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. ఏపీపైనా దృష్టి పెట్టారు. 2014 ఎన్నిక ల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి ఇక్కడ వ్యూహాత్మకంగా ముందుకు సాగితే.. ఫ్యూచర్ బాగానే ఉంటుందని జాతీయస్థాయి నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆచి తూచి ఆర్ ఎస్ ఎస్ స్కూలు నుంచి వచ్చిన సోము వీర్రాజుకు అప్పగించారు. అయితే, ఆయన ఆశించిన విధంగా పెర్ఫార్మెన్స్ కనబరచలేక పోతుండడం గమనార్హం.
అందరినీ కలుపుకొని వెళ్లాలి-పార్టీని అభివృద్ధి చేయాలి! అనే కాన్సెప్టును సోము మరిచిపోయినట్టు కనిపిస్తున్నారనే వాదన బీజేపీలోనే బలంగా వినిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యం ఇవ్వడం, చిన్నచూపు చూడడం, ముఖ్యంగా గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారిపై చిన్న చిన్న కారణాలు చూపుతూ.. సస్పెన్షన్ వేటు వేయడం, అదేసమయంలో అధికార పక్షం పై పోరాడవలసింది పోయి.. ప్రతిపక్ష పార్టీని తరచూ విమర్శించడం వంటివి సోము వీర్రాజుకు ప్రధానంగా మైనస్ అయ్యాయనే ప్రచారం ఉంది. ఇక, పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఆయన వెనుకబడ్డారు. ఆయన వయసు కూడా 60 ప్లస్ కావడంతో పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు. పట్టుమని ఒక ఫర్లాంగు దూరం కూడా నడిచే పరిస్థితి లేకుండా పోవడం కూడా మైనస్లుగా కనిపిస్తున్నాయి.
దీంతో ఆయా అంశాలపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. రాష్ట్ర బీజేపీ కీలక నేత సహా మరికొందరు అధికార వైసీపీ కనుసన్నల్లో రాజకీయాలు చేస్తున్నారనే వాదన ఢిల్లీ పెద్దల చెవిలోనూ పడినట్టు తెలుస్తోంది. పైగా గద్దె బాబు రావు వంటి వారికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా వివాదాలకు దారితీసింది. దీంతో రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనించడంతోపాటు ఇంటిలిజెన్స్ ద్వారా ఏపీలో బీజేపీ పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న బీజేపీ అధిష్టానం.. ఇక్కడ యువతను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే జాతీయస్థాయిలో పార్టీకి అన్ని విధాలా కలిసి వస్తున్న బీసీ నాయకుడు.. సత్యకుమార్‌కు ఏపీ పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
సత్యకుమార్ విషయానికి వస్తే.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈయన కూడా ఏబీవీపీ విద్యార్థి విభాగం ద్వారా.. బీజేపీలోకి వెళ్లారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని కూడా పుణికి పుచ్చుకున్నారు. మీడియా పరంగానూ ఆయన దూకుడుగా ఉన్నారు. తెలుగు మీడియాకు సత్యకాలమ్ పేరుతో ఆర్టికల్స్ రాస్తూ.. మేధావి వర్గాన్ని సైతం పార్టీ వైపు తలతిప్పి చూసేలా చేస్తున్నారు. ప్రస్తుతం సత్యకుమార్.. జాతీయ స్థాయిలో పార్టీలో కీలకనాయకుడిగా ఎదిగారు. పైగా యువ నాయకుడు.. మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడు, ఇటీవల జరిగిన బిహార్ ఎనికల్లో కూడా కీలక పాత్ర పోషించి గెలుపునకు కృషి చేశారు. ఈ క్రమంలో సత్యకుమార్‌కు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మొత్తానికి ఏపీలో అతి తక్కువ సమయంలో సోము కు చెక్ పెట్టడం సంచలన విషయంగా మారింది.