తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాలలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో త్వరలో ఆయన అధికారికంగా చేరుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే బీఆర్ఎస్ మీటింగుల్లో ఇకపైన ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. అందుకు కారణం… నిన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన కేసీఆర్ బహిరంగ సభలో ఆయన కనిపించడమే. సభలో పాల్గొనడానికి కొన్ని నిమిషాల ముందు మహారాష్ట్ర పొలిటీషియన్ అభయ్ పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన ఆయన ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తరువాత బీఆర్ఎస్ రాజకీయ వేదికపై కనిపించడంతో ఆయన రాజకీయ జీవితం మొదలైనట్లేనంటున్నారు.
బహిరంగ సభ వేదిక మీద ఆయనను మహారాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పరిచయం చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణను ఒక మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ నాతో కలిసి పాలుపంచుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నాతో పాటు 24 గంటలూ పనిచేసిన గొప్ప వ్యక్తి…’ అని కేసీఆర్ చెప్పడంతో ఆయన్ను కేసీఆర్ ఏ రకంగా ప్రయోగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా కనిపించిన సోమేశ్ కుమార్ హఠాత్తుగా ఇప్పుడు ఎవ్వరి ఊహకు అందని తీరులో ఔరంగాబాద్ పొలిటికల్ మీటింగ్‌లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఔరంగాబాద్ బహిరంగసభ వేదిక మీద నుంచి ఆయనను అక్కడి ప్రజలకు కేసీఆర్ స్వయంగా పరిచయం చేయడంతో గులాబీ నేతగా మారిపోయారనే సందేశం ఇచ్చినట్లయింది.
బీఆర్ఎస్లో ఇకపైన సోమేశ్ కుమార్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు.. ఆయనకు కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పనున్నారు.. తెలంగాణలోనూ ఆయన సేవలు కొనసాగుతాయా.. లేక ఇతర రాష్ట్రాల వ్యవహారాలపైనే దృష్టి పెడతారా.. వీటన్నింటినీ రానున్న కాలంలో సమాధానం లభించనున్నది. ఐఏఎస్‌గా ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబరు చివరి వరకూ ఉన్నది. సర్వీస్ పూర్తయిన తర్వాత కేసీఆర్‌తో కలిసి పనిచేస్తారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. సలహాదారుగానూ, కన్సల్టెంట్‌గానో కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తారని అటు పార్టీ నేతల నుంచి, ఇటు సచివాలయ అధికారుల నుంచి వినిపించాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల మేరకు సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు అలాట్ అయ్యారు. కానీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలో పనిచేయడానికి అనుమతి పొందారు. చివరకు ఇది వివాదాస్పదమై తెలంగాణ హైకోర్టుకు చేరింది. సుదీర్ఘకాలం తర్వాత విచారణ జరిగి జనవరిలో ఆయనను ఏపీ కేడర్‌గా వెళ్లిపోవాల్సిందేనంటూ తీర్పు వెలువడింది. దీనికి అనుగుణంగా కేంద్ర డీవోపీటీ మంత్రిత్వశాఖ సైతం ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీచేసి జనవరి 12 లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని ఆదేశించింది. దానికి అనుగుణంగా జనవరి 12న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి లాంఛనంగా ఆ రాష్ట్ర కేడర్‌గా జాయిన్ అయ్యారు.
నెల రోజులు దాటినా ఆయనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 17న ఆ దరఖాస్తుకు ఆమోదం దొరకడంతో రిటైరయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి మాత్రమే పరిమితమైన సోమేశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో సేవలందించడానికి నియమితులవుతారని ప్రగతి భవన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. దానికి అనుగుణంగానే ఢిల్లీలోని తెలంగాణ భవన్లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా ఆయనకు ఛాంబర్ కూడా రెడీ అయింది. అనూహ్యంగా ఆయన ఔరంగాబాద్ బహిరంగసభ మీద ప్రత్యక్షం కావడం విశేషం.
మరోవైపు దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలన్న కోరికతో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీని బిహార్ ఎన్నికల బరిలోనూ నిలుపుతారని.. అక్కడి మధుబని లోక్ సభ సీటు నుంచి సోమేశ్ కుమార్ పోటీ చేస్తారన్న ప్రచారం ఒకటి వినిపిస్తోంది. అదే జరిగితే 2024 లోక్ సభ ఎన్నికలలో ఆయన తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.