కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. టీడీపీ యువ నాయకుడు, వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా ఆరోపించారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు.
వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో.. రంగా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
“నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. నన్ను చంపాలని చూసినా భయపడను, దేనికైనా సిద్ధం. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యం“ అని రాధా స్పష్టం చేశారు. అయితే.. తనను ఎవరు ఎప్పుడు.. ఇలా ప్రయత్నించారనే విషయంపై ఆయన మౌనంగా ఉండడం గమనార్హం. కొంత మేరకు మాత్రమే ఆయన.. ఈ విషయం వెల్లడించడం.. మిగతాది సస్పెన్స్‌లో పెట్టడం గమనార్హం.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. రంగా విగ్రహావిష్కరణకు కార్యక్రమానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తనను చంపేందుకు రెక్కీ చేశారన్న వ్యాఖ్యలపై రాధాను ప్రశ్నించగా.. త్వరలోనే అన్ని విషయాలు బయటికివస్తాయంటూ బదులిచ్చారు. మొత్తంగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
ఇవాళ ఉదయం టీడీపీ నేత వంగవీటి రాధాను.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. విజయవాడలోని రాధా కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా వర్ధంతి సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. వంగవీటి రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. వంశీ.. వైసీపీకి మద్దతిస్తున్నారు. టీడీపీకి చాలా డిస్టెన్స్ మెయింటెన్ చేస్తుండడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలో ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.