టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టబోతున్న పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 27 నుంచి 400 రోజులపాటు ఏకధాటిగా 4000 కిలోమీటర్ల మేర సాగేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా రెడీ కాగా…అనుమతులు ఇవ్వకుండా యాత్రను అడ్డుకునేందుకు జగన్ అండ్ కో స్కెచ్ వేసింది. కావాలనే అనుమతులివ్వకుండా పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా లోకేష్ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు అనుమతిచ్చారు. యాత్రకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన మీదటే అనుమతినిచ్చామని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు, ఎమర్జెన్సీ సర్వీసులకు, వాటి రాకపోకలకు ఆటంకాలు కలిగించకుండా చూసుకోవాలని షరతులు విధించారు. అంతేకాదు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని కూడా నిబంధనలు పెట్టారు.
ఇక, యాత్ర సందర్భంగా టపాసులను పేల్చడం, బాణా సంచా కాల్చడం నిషిద్ధమని నిబంధన విధించారు. ఇక, నిర్దేశించిన సమయాలకు కట్టుబడి బహిరంగ సభలను నిర్వహించుకోవాలని సూచించారు. అయితే, సమావేశ స్థలాల్లో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్సులను ఏర్పాటు చేసుకోవాలని షరతు పెట్టారు. ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని అన్నారు. ఇక, రోడ్లపై సమావేశాలను నిర్వహించకూడదని చెప్పారు. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రకు పోలీసులు విధించిన షరతులపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.