అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన దేశంగా కీర్తి గడించిన జపాన్ లో ఇటీవల కాలంలో బాంబుల సంస్కృతి పెరుగుతోంది. మాజీ ప్రధాని షింజో అబేను అతి సమీపం నుంచి ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదపై కూడా బాంబు ప్రయోగం జరిగింది.
అయితే.. ఈ పెద్ద ప్రమాదం నుంచి కిషిద బయటపడ్డారు. పశ్చిమ జపాన్లోని వకయామ రాష్ట్రం సైకజాకి పోర్టులో.. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తమ పార్టీ అభ్యర్థికి మద్ధతుగా ప్రధాని కిషిద ప్రచారం చేస్తున్న సమయంలో స్మోక్ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో కిషదకు గాని, ప్రచార కార్య క్రమంలో పాల్గొన్నవారికి కానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.
బాంబు పేలుడు ఘటనతో ప్రధాని కిషిద ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి పరుగెత్తాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది ప్రధాని కిషిదాను ఘటనా స్థలం నుంచి క్షేమంగా తీసుకువెళ్లారు. బాంబు పేల్చిన వ్యక్తిని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మాజీ ప్రధాని షింజే అబేను.. 9 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఒక దుండగుడు హత్యచేశాడు. ఇప్పుడు ప్రధాని కిషద కూడా ప్రచారంలో ఉండగానే బాంబు దాడి జరిగింది. దీంతో జపాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.