వచ్చింది.. వణికించింది.. వెళ్లిపోయిందని ధీమాగా ఉన్న వారికి కొత్తగా దడ పుట్టిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి వెళ్లిన కరోనా.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా తన రచ్చను ఆపటం లేదు. గడిచిన వారం రోజులుగా దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతను చూస్తూ.. ఇదే పరిస్థితి మరికొంతకాలం కంటిన్యూ అయితే.. తిప్పలు తప్పనట్లే.
ఇలాంటివేళ.. ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్.. స్క్రీన్ గార్డుల్లో కరనా వైరస్ ఎక్కువ కాలం జీవించే వీలుందన్న విషయాన్ని వారు గుర్తించారు. సాధారణ అద్దాలతో పోలిస్తే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద వైరస్ ఎక్కువ కాలం జీవించే వీలుందని తేల్చారు. స్క్రీన్లు.. స్క్రీన్ గార్డులకు నీటిని పీల్చుకునే గుణం లేకపోవటమే దీనికి కారణంగా తేల్చారు.
ఫోన్ మాట్లాడే వేళలో.. నీటి తుంపరులు స్మార్ట్ ఫోన్ మీద పడుతుంటాయి. కరోనా బారినపడిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు.. భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంతసేపు ఎండిపోకుండా ఉంటాయనే అంశంపై వారి పరిశోధనలు జరిపారు. తుంపర్లు ఎండిపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయన్న విషయాన్ని గుర్తించారు.
మామూలు నీటి బిందువులతో పోలిస్తే.. ఒక వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లలో ఉప్పు.. మ్యూకస్.. కొంతమేర నీరు కలిసి ఉంటాయని.. వీటి కారణంతో తుంపర్లు ఆవిరి కావటానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని గుర్తించారు. ఒక నానోలీటరు తుంపర జీవితకాలం ఒక్క నిమిషం మాత్రమే అని.. అదే 10 నానోలీటర్ల తుంపర ఆవిరి కావటానికి మాత్రం పావుగంట పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అంతేకాదు.. గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ తేమ ఉంటే ఆ సమయం గంటకు పైగా ఉంటుందని.. ఎండిపోయిన తుంపర్లలో కొన్నిసార్లు వైరస్ బతికే ఉంటుందన్న కొత్త విషయాన్ని గుర్తించారు. ఎందుకలా? అన్న కారణాన్ని తెలుసుకోవటానికి మరింత పరిశోధన జరగాలని ఐఐటీ హైదరాబాద్ చెబుతోంది. మరి.. వారి పరిశోధనలు మరెన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో?