పేరు చెప్పినంతనే కళ్ల ముందు రూపం కదలాడటం అందరు సెలబ్రిటీల విషయంలో సాధ్యం కాదు. అందునా.. కొరియోగ్రఫీ లాంటి రంగంలో పేర్లు చెప్పినంతనే ప్రజలకు గుర్తుకు వస్తున్నారంటే.. అదంతా బుల్లితెర మహత్యమే.
డ్యాన్స్ షోల కారణంగా సుపరిచితులుగా మారిన కొరియోగ్రాఫర్లలో.. వయసుతో సంబంధం లేకుండా అందరికి కనెక్టు అయ్యే అతి కొద్ది మందిలో శివశంకర్ మాస్టర్ ఒకరు. కరోనా కారణంగా ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఐఏజీ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు.
గడిచిన నాలుగు రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు 75 శాతం మేర కరోనా ఇన్ ఫెక్షన్ సోకటంతో పరిస్థితి విషమంగా ఉందని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
శివశంకర్ మాస్టర్ తో పాటు ఆయన సతీమణి.. పెద్ద కొడుక్కి కరోనా బారిన పడ్డారు. మాస్టర్ సతీమణి హోం క్వారంటైన్ లో ఉండగా.. ఆయన పెద్ద కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నారు.
చిత్ర రంగంలో ప్రముఖుడైన శివశంకర్ మాస్టర్ దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్మించిన సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. పది భాషలకు పైనే సినిమాలకు ఆయన సేవలు అందించినట్లుగా చెబుతారు. ఇప్పటివరకు 800 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిన ఆయన.. పలు భాషల్లోఉత్తమ పనితీరును ప్రదర్శించి పలు అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.
కరోనా తీవ్రత బాగా తగ్గిపోయిందని చెబుతున్నప్పటికీ.. ప్రముఖులు పలువురు దాని బారిన పడటం.. తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవటం ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. శివశంకర్ మాస్టర్ విషయంలో ఆయన కుటుంబంలో ముగ్గురు కరోనా బారిన పడటం.. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండటం చూస్తే అయ్యో అనిపించటం ఖాయం. ఆయన త్వరగా కోలుకోవాలని.. ఎప్పటిలానే హుషారుగా ఉండాలని కోరుకుందాం.