తెలంగాణలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు A1గా చేర్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో బండి సంజయ్ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. బండి సంజయ్ కు హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిపల్ మేజిస్టేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, సంజయ్ రిమాండ్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో బిజెపి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ పోలీసులను ఆదేశించింది. దీంతో, మేజిస్ట్రేట్ కోర్టు బండి సంజయ్ కి బెయిల్ నిరాకరించినా హైకోర్టులో అప్పులు చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టు మూడు రోజులు సెలవులు ఉన్నప్పటికీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మరోవైపు, బండి సంజయ్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలోనే ఈ పేపర్ లీక్ కు సంబంధించి బండి సంజయ్ దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టాలని సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని సంజయ్ కు నోటీసులు జారీ చేయగా ఆయన తరఫు న్యాయవాదులు సిట్ ముందు హాజరయ్యారు. మరోవైపు, కోర్టు అనుమతి తీసుకుని నోటీసులు జారీ చేసిన తర్వాతే ఆయనను ప్రశ్నించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.