ఏపీ లో పోస్ట్ పోల్ వయొలెన్స్ తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులపై తొలిసారిగా ఏపీలో సిట్ ఏర్పాటు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్ద నేరాలు, కుంభకోణాలు జరిగినప్పుడు పోలీసులతో సిట్ ఏర్పాటు చేయడం పరిపాటి. కానీ, ఏపీ చరిత్రలో తొలిసారిగా పోలీసులపైనే సిట్‌ను వేయడం షాకింగ్ గా మారింది.
అయితే, పోలీస్ శాఖ స్వయంకృతం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఐదేళ్లపాటు వైసీపీ నేతలకు అనుకూలంగా చాలామంది పోలీసులు వ్యవహరించారని, అందుకు పోలీసు డిపార్ట్ మెంట్ మూల్యం చెల్లించుకుంటున్నారని టాక్ వస్తోంది. అధికార పార్టీకి కొమ్ముకాసిన కొందరు అధికారుల తీరు వల్ల అందరూ ఇప్పుడు తామూ మాటలు పడాల్సివస్తోందని వాపోతున్నాయి.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం 13 మంది పోలీసు అధికారుల బృందంతో సిట్ ఏర్పాటైంది. నిఘా విభాగం ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి(శ్రీకాకుళం), వల్లూరు శ్రీనివాసరావు(ఒంగోలు), రవి మనోహరాచారి(తిరుపతి), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు భూషణం (గుంటూరు రేంజ్), వెంకట్రావు (ఇంటెలిజెన్స్, విశాఖ), రామక్రిష్ణ(ఏసీబీ), జీఎల్ శ్రీనివాస్ (ఏసీబీ), మోయిన్ (ఒంగోలు పీటీసీ), ప్రభాకర్ (ఏసీబీ, అనంతపురం), శివప్రసాద్ (ఏసీబీ)లతో సిట్ ఏర్పాటైంది.
శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం చెందారంటూ ఈసీ ఆగ్రహానికి గురైన ఎస్పీలు బిందుమాధవ్(పల్నాడు); అమిత్ బర్దార్(అనంతపురం), కృష్ణకాంత్ పటేల్(తిరుపతి).. డీజీపీకి తమ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. వీరితోపాటు పల్నాడు జిల్లా కలెక్టర్ ను కూడా ఈసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.