ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు నిత్యం భుజాలు చరుచుకుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇలాంటి దారుణమైన పాలన ఏపీలో ఇంతకుముందు ఎన్నడూ లేదని ఆరోపిస్తుంటాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలన ఎలా ఉందో ఒక్క మాటలో ఆమె వివరించారు. పిచ్చోడి చేతిలో రాయి చందంగా జగన్ పాలన ఉందని.. జగన్ పాలనలో అరాచకం, రౌడీయిజం విపరీతంగా పెరిగిపోయాయని ఆమె అన్నారు.
విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న రేణుక అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనను ఏకి పడేశారు. వైసీపీ పాలనను నరకంలా భావిస్తున్నారని… ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని.. ఎన్నికలు రాగానే జగన్ను ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని రేణుక అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజాతీర్పుతో వైసీపీకి గుణపాఠం కలుగుతుందని ఆమె చెప్పారు.
ఏపీలో కుల రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తున్నా జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆమె అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని ఇక్కడి ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని.. కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరిస్తే ఏపీలో పోటీ చేస్తానని రేణుక చెప్పారు. అంతవరకు ఏపీలో తాను పర్యటిస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని అన్నారు.
మరోవైపు తెలంగాణలో రాజకీయాలపైనా రేణుక స్పందించారు. కేసీఆర్ తెలంగాణ వదిలి దేశమంతా తిరుగుతున్నారని… తెలంగాణలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాలలో తిరుగుతున్నారని అన్నారు. తెలంగాణ కోసం పార్టీ పెట్టి ఇప్పుడు ఆ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించారని రేణుక విమర్శించారు. కాగా కృష్ణాజిల్లా కేంద్రంగా ఏపీలో రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఆసక్తి చూపుతున్నారు రేణుక చౌదరి. అందులో భాగంగానే ఆమె విజయవాడకు వస్తున్నారని చెప్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన కమ్మ సామాజికవర్గ నాయకులు, ప్రముఖులతో రేణుక భేటీ అవుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను ఏపీ నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.