ప్రముఖ గాయకుడు కేకే ఆకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది సహజ మరణం కాదని అసహజ మరణం అని కోల్ కతా పోలీసులు అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కూడా చెబుతున్నారు. కేకే చనిపోయిన సమయంలో ఆయన తలకు బలంగా గాయం అయిందని, ఆయన షో చేసినప్పుడు కూడా బాగా ఇబ్బంది పడ్డారని డీ హైడ్రేషన్ కారణంగా కూడా కార్డియాటిక్ అరెస్టు ఉంటుందని కొందరు దర్యాప్తు బృంద సభ్యులు మరియు వైద్యులు అంటున్నారు. ఇదంతా షో నిర్వాహణలో తలెత్తిన లోపం కారణంగానే జరిగిందన్న వాదన వస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పట్టుబడుతున్నారు ఆయన అభిమానులు.
వాస్తవానికి షో జరిగిన తరువాత ఆయన అభిమానుల కోలాహలం నుంచి తప్పుకుని హోటల్ రూంకు వెళ్లారని తెలుస్తోంది. అక్కడే ఆయన పడిపోయారని సమాచారం. ఈ ఘటన తరువాతే ఆయన ప్రాణాలు విడిచారని పోలీసులు అంటున్నారు. తగినంత వసతులు కల్పించడకుండా, కనీసం ఫ్యాన్ కానీ, ఏసీ కానీ ఉంచకుండా అక్కడ షో నిర్వహించారని కూడా తెలుస్తోంది. మరోవైపు కేకే మరణంపై పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ, గాయకుడిగా ఆయన తన సినిమాల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన పాటలకు ఏ విధంగా ప్రాణం పోశారో చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తూ సంతాప సందేశం విడుదల చేశారు.