ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్ దివంగత శ్రీదేవి భర్త, బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ కారును కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు సంయుక్తంగా సీజ్ చేశారు. దీనిలో ఏకంగా 200 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వేడిలో ఉన్న కర్ణాటకలో ప్రజలకు పంచేందుకు వీటిని తీసుకువెళ్తున్నారా? అన్న కోణంలో వారు దర్యాప్తును చేస్తున్నారు. దావణగెరె తాలూకాలోని హెబ్బెలు టోల్ సమీపంలో ఓ BMW కారులో 66 కేజీల వెండి వస్తువులను ఈసీ అధికారులు సీజ్ చేశారు.
వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి తరలిస్తున్నట్లు వెల్లడించా రు. వీటి విలువ సుమారు రూ.39 లక్షల పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టరై ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. కారు డ్రైవర్ హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నీ అనుమానాలే!
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మరోవైపు డబ్బులు, నగల రవాణా పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పెంచింది. చెక్‌పోస్టులు వద్ద పాయింట్లను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేసి కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు.ఈ క్రమంలోనే బోనీ కపూర్ కారు పట్టుబడడం గమనార్హం. దీనిపై బోనీ ఇంకా స్పందించలేదు. బోనీ కపూర్ బీజేపీ మద్దతు దారుడనే పేరున్న విషయం తెలిసిందే.