మిల్పిటాస్, కాలిఫోర్నియా – సిలికానాంధ్ర 23వ సంస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 3వ తేదీ సాయంత్రం మిల్పిటాస్లోని సిలికానాంధ్ర భవన్లో ఘనంగా వేడుకలు జరిగాయి. శ్రీ మారేపల్లి వేంకటశాస్త్రి గారి ఆత్మీయ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి హాజరైన వారికి సాదర స్వాగతం పలికారు, సిలికానాంధ్ర సంస్థ యొక్క 23 సంవత్సరాల ప్రయాణం మరియు సాధించిన గణనీయమైన పురోగతిపై ఆయన సభకు తెలుపారు.
ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అనేక సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శ్రీమతి మంజుల సరిపల్లె, శ్రీమతి మాధురి సరిపల్లె వీణా వాయిద్య కచేరీ, అనఘ అయ్యగారి వయోలిన్ కచేరీ ఆహూతులను మైమరపించాయి. శ్రీమతి మాల తంగిరాల, శ్రీమతి శాంతి కూచిభొట్ల, శ్రీమతి అపర్ణ ధూళిపాళ్లల ఆద్వర్యంలో లలితగీతాలు, జానపద, శాస్త్రీయ బృంద గానాలు ఆహ్లాదకరంగా సాగాయి.
మాధవ్ కిదాంబి, సూరజ్ దాసిక, తాటిపాముల మృత్యుంజయుడు లఘు నాటికలు ప్రదర్శించాయి. గరిమెళ్ల అనీల కుమార్ ‘అన్నమయ కీర్తనలు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ రచయిత జంధ్యాల రచించి శ్రీ దిలీప్ కొండిపర్తి దర్శకత్వంలో ప్రదర్శించిన హాస్య నాటకం ‘ఓ చీకటి రాత్రి’ ప్రేక్షకులను నవ్వించింది. కైవల్య గారి దన్యవాదాలతో ముగింపు వాక్యాలు పలికారు. ఆహూతులకు షడ్రషోపేతమైన విందు భోజనం వండి వార్చారు.