తమిళ కథానాయకుడు సిద్దార్థ్ ను తెలుగు వాళ్లు ఒకప్పుడు ఎంతగా ఓన్ చేసుకున్నారో తెలిసిందే. అతను స్టార్ ఇమేజ్ సంపాదించింది తెలుగులో. ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఇక్కడే. తన తొలి చిత్రం ‘బాయ్స్’ తమిళంలో కంటే తెలుగులో బాగా ఆడింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించి చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌కే పరిమితం అయ్యాడు అతను.
కానీ తర్వాతి రోజుల్లో సరైన సినిమాలు లేక ఇక్కడ తన ఫాలోయింగ్ దెబ్బతింది. చివరికి ఇక్కడి నుంచి బేస్ మార్చేసి తమిళంలోకి వెళ్లిపోయాడు. అక్కడే సినిమాలు చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ మూవీతో రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకపోయింది. తమిళం నుంచి అనువాదం అవుతున్న తన సినిమాలు కూడా తెలుగులో పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘చిన్నా’ పేరుతో తన కొత్త చిత్రం ‘చిత్తా’ తెలుగులోకి రాబోతోంది.
ఐతే ఈ సినిమాను తమిళంతో పాటే తెలుగులో సెప్టెంబరు 28న రిలీజ్ చేయాలని చూస్తే.. థియేటర్లు దొరకలేదని సిద్ధు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘చిన్నా’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రెస్ మీట్లో అతను ఈ విషయం వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యాడు. దాదాపుగా కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ఈ సినిమాను తమిళంలో రెడ్ జెయింట్స్ బేనర్ మీద ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ చేశాడని.. మలయాళంలో పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన గోకులం ఫిలిమ్స్, కన్నడలో కేజీఎఫ్ నిర్మాతలు రిలీజ్ చేశారని.. కానీ తెలుగులోకి వచ్చేసరికి సిద్దార్థ్ సినిమా ఎవరు చూస్తారు అంటూ ఈ సినిమాకు థియేటర్లు ఇవ్వలేదని సిద్ధు అన్నాడు.
అలాంటి పరిస్థితుల్లో ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ తనకు సపోర్ట్ చేసి ఈ వారం సినిమాను రిలీజ్ చేస్తున్నారని సిద్ధు ఎమోషనల్ అయ్యాడు. తాను గతం గురించి మాట్లాడనని.. చరిత్ర అంతా చెప్పనని.. తనో మంచి సినిమా తీశానని.. అది చూసిన తర్వాత సిద్ధు సినిమాలు బాగుండవు, మేం చూడం అని చెబితే తాను మళ్లీ ఇక్కడికి రానని, ప్రెస్ మీట్ పెట్టనని సిద్ధు తేల్చి చెప్పాడు.