ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని, అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని విమర్శిస్తున్నాయి. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వారి తీరు మారలేదు. తాజాగా ఫిర్యాదు చేయడానికి స్టేషన్ కు వెళ్లిన వ్యక్తిపై ఎస్ ఐ దాడి చేసిన ఘటన పెను దుమారం రేపుతోంది.
ఓ యువకుడిపై శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎస్ఐ రంగడు యాదవ్ వీరంగం సృష్టించారు. వైసీపీ నేత తనపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ కంప్లయింట్ ఇచ్చేందుకు వెళ్లిన ఆ యువకుడిపై ఎస్ఐ దాడికి పాల్పడ్డాడు. బూతులు తిడుతూ పోలీస్ స్టేషన్ లోనే అందరి ముందు విచక్షణారహితంగా ఆ యువకుడిపై ఎస్ ఐ రంగడు దాడి చేశారు. ఈ ఘటనను పక్కనున్న వ్యక్తి వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సంజీవరాయనపల్లి గ్రామంలో పద్మావతి అనే దివ్యాంగురాలికి పింఛన్ ఇవ్వకుండా అధికార పార్టీ నేత ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. పింఛన్ ఎందుకు ఇవ్వడంలేదని అడిగిన పద్మావతి కుమారుడు వేణుపై స్థానిక నేత దామోదర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వేణుపై ఎస్ఐ అసభ్యపదజాలంతో దాడికి పాల్పడ్డారు. ఆ దాడి వీడియో వైరల్ అయింది.
దీంతో, ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ స్పందించారు. ఆ ఘటనపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్యను విచారణాధికారిగా నియమించారు. విచారణ ఆధారంగా చర్యలు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు?’’ అని ట్వీట్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేశారు.
ఫిర్యాదు చెయ్యడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన బాధితుడిని బూతులు తిడుతూ భౌతిక దాడి చెయ్యడాన్ని రాజా రెడ్డి రాజ్యాంగంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారా జగన్ రెడ్డి గారు?(1/3) pic.twitter.com/4ymwWexCP4
— Lokesh Nara (@naralokesh) May 1, 2022