పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ ఇంటి వాడైతే చూడాలని ఆయన అభిమానులు దాదాపు దశాబ్ద కాలం నుంచి ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి బిగ్ అప్డేట్ ఇచ్చారు. నవరాత్రుల సందర్భంగా శ్యామలాదేవి బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. ఆలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు శ్యామలాదేవికి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో శ్యామలాదేవి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారికి దుర్గమ్మ అంటే చాలా ఇష్టమని ,ఇక్కడికి వస్తే ఆయనే గుర్తుకు వస్తారని శ్యామలాదేవి అన్నారు. ప్రతి సంవత్సరం ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు.
ఇక మీడియా వారు ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆ రోజు త్వరలోనే రానుందని శ్యామలాదేవి తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు కృష్ణంరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడూ ఉంటాయని.. త్వరలోనే బాబు వివాహం జరగనుందని శ్యామలాదేవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. త్వరలో మా వదిన రాబోతోందంటూ తెగ రచ్చ చేస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి 2898 ఏడీ చిత్రంతో బిగ్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో `కల్కి 2`, ప్రశాంత్ నీల్ తో `సలార్ 2`, మారుతి దర్శకత్వంలో `రాజా సాబ్` చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలె హను రాఘవపూడితో ఓ కొత్త చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.