శాస్త్రజ్ఞుల ఆందోళన ప్రకారం వెంటనే జనాలు మేల్కొనకపోతే దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం మొత్తాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కీలకమైంది. గాలి, ఆహారం, పానీయాల ద్వారా ప్లాస్టిక్ మనుషుల రక్తంలోకి చేరిపోతోంది. ప్లాస్టిక్ భూతం నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే అర్జంటుగా యావత్ ప్రపంచం నుండి ప్లాస్టిక్ ను నిషేధించటం ఒకటే మార్గం. అలా కాకపోతే ప్లాస్టిక్ ను ప్రపంచం నుండి దూరంగా పెట్టడం సాధ్యం కాదు.
మనుషుల శరీరంలోకి చేరుకుంటున్న ప్లాస్టిక్ రేణువులు పేగులు, లివర్, ఊపిరితిత్తుల్లో పేరుకుపోతున్నాయి. మనిషి మనుగడకు పేగులు, లివర్, ఊపిరితిత్తుల పనితీరు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రేణువులు గనుక ఎక్కువైపోతే మనిషి ప్రాణాలకు హాని తప్పదు. నెదర్లాండ్స్ లోని పరిశోధక బృందం 22 మందిని పరిశీలించిన తర్వాత 17 మందిలో ప్లాస్టిక్ రేణువులను గుర్తించింది.
ముందు పేగులు, ఊపిరితిత్తులు, లివర్ లో చేరుకుంటున్న ప్లాస్టిక్ రేణువులు తర్వాత రక్తం సరఫరా ద్వారా శరీరంలోని మిగిలిన అవయవాల్లోకి కూడా చేరుకుంటున్నట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు. శరీరంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ రేణువుల వల్ల దీర్ఘకాలంలో అనేక కొత్త రోగాలు వచ్చే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుండటం, అదే సమయంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే మానవ శరీరంలో ప్లాస్టిక్ రేణులు చేరటం శాస్త్రజ్ఞులను షాక్ కు గురిచేసింది.